భారత్-పాక్ మ్యాచ్; టర్నింగ్ పాయింట్స్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా చేజేతులారా ఓడింది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారీ తేడాతో భారత్ ఓడిపోవడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కోహ్లిసేన ఆట తీరులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు టీమిండియా ఓటమికి కారణలయ్యాయని విశ్లేషిస్తున్నారు.
1. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు కోహ్లి మూల్యం చెల్లించుకున్నాడు. టాస్ ఓడిపోవడం పాకిస్తాన్ టీమ్‌కు కలిసొచ్చింది. అయితే తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటానని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పడం విశేషం. టాస్ గెలిస్తే పాకిస్తాన్‌కు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వొద్దని మాజీ ఇమ్రాన్ ఖాన్ ఎందుకు చెప్పాడో టీమిండియాకు తెలిసొచ్చివుంటుంది.
2. భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ కొంపముంచింది. సెంచరీ వీరుడు ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేసే అవకాశాన్ని బుమ్రా కాలదన్నాడు. నోబాల్ విసిరి అతడి సెంచరీకి కారణమయ్యాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫకార్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగాడు.
3. ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లి సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ కావడం మ్యాచ్‌లో పెద్ద మలుపు. ఒంటిచేత్తో విజయాలు అందించగల సత్తా ఉన్న టీమిండియా కెప్టెన్ స్వల్ప స్కోరుకే పెలివిలియన్ చేరడంతో ఓటమి ఖాయమయింది. ఒక లైఫ్ ఇచ్చినప్పటికీ కోహ్లి నిలదొక్కుకోకపోవడంతో భారత్ బ్యాటింగ్ గాడి తప్పింది.
4. పాక్ బౌలర్ ఆమిర్ విజృంభణతో భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతకాలం ఆటకు దూరమైనా అతడి బౌలింగ్‌లో పదును తగ్గలేదు. ముగ్గురు టాప్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆమిర్ ధాటికి రోహిత్(0), ధావన్(21), కోహ్లి(5) తోక ముడిశారు.
5. హేమాహేమీలందరూ ఎవరో పిలుస్తున్నట్టు పెవిలియన్‌కు వడివడిగా వరుస కట్టినా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం అంత సులువుగా లొంగలేదు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్న పాండ్యా భారీ ఓటమి నుంచి గట్టెక్కిస్తాడని ఆశ పడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు రనౌట్ కావడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు.