హార్దిక్ బ్యాటింగ్ రికార్డు
లండన్:చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ 180 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టు సమష్టిగా విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే నిన్నటి భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మెరుపులు తప్పితే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హార్దిక్ చెలరేగి ఆడి భారత్ అభిమానుల్లో కాసేపు జోష్ ను తీసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ నెలకొల్పిన రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ల్లో వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ ఫైనల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గిల్ క్రిస్ 33 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సవరించాడు. ఆ రికార్డును 18 ఏళ్ల క్రితం గిల్లీ నెలకొల్పాడు. 1999 వరల్డ్ కప్ లో గిల్ క్రిస్ట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సాధించగా, దాన్ని ఇంతకాలానికి హార్దిక్ పాండ్యా అధిగమించాడు.