నేను మీలాగే షాకయ్యాను: హార్దిక్ పాండ్యా
బర్మింగ్ హామ్: దాయాది పాకిస్తాన్ పై గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో 124 పరుగులతో నెగ్గి భారత్ శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరుడు యువరాజ్ సింగ్(32 బంతుల్లో 53: 8 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాక అందర్నీ అశ్చర్చంలో ముంచెత్తుతూ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో అడుగుపెట్టాడు. అయితే ఈ విషయంపై పాండ్యా స్పందించాడు. 'కోచ్ అనిల్ కుంట్లే నాకు పెద్ద షాకిచ్చాడు. ఆపై క్రీజులో కనిపించి నేను మీకు కూడా షాకిచ్చాను. ఎలా అంటే.. భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్ జరుగుతుంటే కోచ్ నావద్దకు వచ్చి త్వరగా ప్యాడ్లు కట్టుకుని రెడీగా ఉండమన్నారు.
అంతలోనే యువీ ఔట్ కావడం.. నేను క్రీజులోకి రావడం చకచకా జరిగిపోయాయి. నిజం చెప్పాలంటే ఆ స్థానంలో ధోనీ రావాలి. కానీ కుంబ్లే సూచనమేరకు నేను ముందు దిగాను. నాకు బ్యాటింగ్ చాయిస్ వస్తుందని అనుకోలేదు. ఒత్తిడి సమయంలో క్రీజులోకొచ్చినా కూల్ గా ఆడాను. ఒత్తిడిని భరించడం నా వల్ల కాదు. అందుకే ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా.. ఓ మాములు మ్యాచ్ లా ఆడి ఫలితం రాబట్టానని' తాజా ఇంటర్వ్యూలో పాండ్యా ఈ విషయాలను వెల్లడించాడు. చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించిన పాండ్యా 6 బంతుల్లోనే 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.