మూడు మెయిడిన్లు.. మూడు వికెట్లు..
► పాకిస్తాన్ విజయలక్ష్యం 237
► రాణించిన లంక ఓపెనర్ డిక్ వెల్లా
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బిలో సోమవారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. అమీతుమీ పోరులో లంకేయుల్ని 49.2 ఓవర్లలో 236 పరుగులకే కూల్చేసి బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు. అటు ఫాస్ట్ బౌలర్లు, ఇటు మీడియం పేసర్లు విజృంభించడంతో లంక పూర్తి ఓవర్లు ఆటకుండానే చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీలు తలో మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ అమిర్, ఫాహీమ్ అష్రాఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.
ప్రధానంగా పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన పేసర్ జునైద్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. జునైద్ వేసిన ఓవర్లలో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. వన్డే మ్యాచ్ లో ఒక పాకిస్తాన్ బౌలర్ మూడు అంతకంటే ఎక్కువ మెయిడిన్లు వేయడం నాలుగేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2013లో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో ఆఫ్రిది మూడు మెయిడిన్ల వేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి ఆఫ్రిది సరసన జునైద్ చేరాడు.
ఇదిలా ఉంచితే, తాజా మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులు గుణతిలకా(13) వికెట్ ను ఆదిలోనే కోల్పోయారు. ఆ తరుణంలో డిక్ వెల్లా అత్యంత జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. కుశాల్ మెండిస్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే జట్టు స్కోరు 82 పరుగుల వద్ద మెండిస్(27) అవుట్ కావడంతో పాటు, ఆపై వెంటనే చండిమల్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 83 పరుగులకు మూడు వికెట్లను కోల్పయారు లంకేయులు.
అయితే డిక్ వెల్లా(73; 86 బంతుల్లో 4 ఫోర్లు) ఆత్మవిశ్వాసంతో ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి మెండిస్(27), మాథ్యూస్(39)ల నుంచి కూడా మోస్తరు సహకారం లభించడంతో లంకేయుల్లో నిలకడగా కనబడింది. అయితే జట్టు స్కోరు 161 పరుగుల వద్ద మాథ్యూస్ నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత లంకేయులు వరుసగా వికెట్లను చేజార్చుకున్నారు. ఆరు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో లంక తేరుకోలేకపోయింది.ఇక చివర్లో గుణరత్నే(27),లక్మాల్(26)లు ఫర్వాలేదనిపించడంతో లంక 237 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందుంచింది.