నెహ్రా.. నా జాకెట్ తీసుకున్నాడు!
యువరాజ్ సింగ్ ఎక్కడుంటే అక్కడ అంతా సందడిగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తుపాను ఇన్నింగ్స్ ఆడి 32 బంతుల్లో 53 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన యువీ.. డ్రసింగ్ రూంలో కూడా జట్టు సభ్యులు అందరితో సరదాగా గడిపేస్తాడు. అంతేకాదు.. ఖాళీ దొరికినప్పుడల్లా తన ఫోన్ తీసుకుని ఏదో ఒకటి చేస్తూ కనిపిస్తాడు. తాజాగా అలాగే ఎప్పటిదో పాత కాలం నాటి ముచ్చట ఒకటి గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటో పోస్ట్ చేశాడు ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. బాగా కుర్రాళ్లుగా ఉన్నప్పటి రోజుల్లో తాను, ఆశిష్ నెహ్రా కలిసి ఒక స్నేహితుడితో తీయించుకున్న ఫొటో పెట్టాడు. అయితే.. ఫొటో కంటే దానికి యువీ జోడించిన క్యాప్షనే బాగా సెన్సేషనల్ అయ్యింది. 'సీరియస్ త్రోబ్యాక్! నెహ్రా నా జాకెట్ వేసుకున్నాడు' అని దానికి కామెంట్ రాశాడు. దాంతో ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏకంగా 1.27 లక్షలకు పైగా లైకులు దీనికి వచ్చాయి.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ చూసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. యువీ నిజంగా గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడని, దానివల్ల తనకు బోలెడంత ఆత్మవిశ్వాసం వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాతే తాము కూడా బాగా ఆడగలిగామని, తాను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఫ్రీగా ఆడలేకపోయాననని, ఆ సమయంలో యువీ వచ్చి తన మీద ఉన్న ఒత్తిడి అంతటినీ అలా చేత్తో తీసి పారేశాడని కోహ్లీ ప్రశంసల్లో ముంచెత్తాడు. లో, ఫుల్ టాస్‌లతో పాటు చివరకు యార్కర్లను కూడా ఫోర్లు, సిక్సులుగా మలిచిన ఘనత యువీకే దక్కుతుందన్నాడు.