కివీస్ కు సవాల్!
బర్మింగ్ హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఎలో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో న్యూజిలాండ్కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. తాము ఎదుర్కొనే తొలి మ్యాచ్లోనే ఆసీస్ రూపంలో బలమైన ప్రత్యర్థి కివీస్ కు ఎదురుకావడం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించిన చరిత్ర కివీస్ కు లేదు. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగుసార్లు ఈ ట్రోఫీలో ముఖాముఖి పోరులో తలపడగా ప్రతీసారి ఆసీస్ నే విజయం వరించింది.
2002, 2004, 2006, 2009 సంవత్సరాల్లో కివీస్ తో జరిగిన మ్యాచ్ ల్లో ఆసీస్దే పైచేయిగా నిలిచింది. 2013లో మాత్రం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. దాంతో అదే సెంటిమెంట్ కివీస్ ను కలవర పరుస్తోంది. ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఆసీస్ ను ఓడించాలంటే కివీస్ శ్రమించక తప్పదు. ఇదిలా ఉంచితే, ఈ ట్రోఫీలో భాగంగా కివీస్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడగా, ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్ లో భారత్ పై ఓటమి పాలైన కివీస్, లంకేయులతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో విజయం సాధించింది.
మరొకవైపు ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 15 ప్రధాన వన్డే టోర్నమెంట్లలో కివీస్ మూడుసార్లు మాత్రమే గెలుపును సొంతం చేసుకుంది. ఇక్కడ ఆసీస్ ను 11సార్లు విజయం వరించడం విశేషం. కాగా, ప్రధాన టోర్నీల్లో భాగంగా 2000 సంవత్సరం నుంచి చూస్తే ఇరు జట్ల మధ్య పది వన్డే మ్యాచ్ లు జరగ్గా ఒక దాంట్లో మాత్రమే కివీస్ విజయం సాధించడం ఇక్కడ గమనార్హం. ఈ క్రమంలో తమ పేలవమైన రికార్డును చెక్ పెట్టాలని కివీస్ భావిస్తుండగా, విజయాల రికార్డునే కొనసాగించాలనే ఆసీస్ యోచిస్తోంది. దీనిలో భాగంగా తాజా చాంపియన్స్ ట్రోఫీలో ఎడ్జ్బస్టాన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగే వన్డేలో కివీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపాడు.