ఒక్క మ్యాచ్ గెలువకుండానే తోక ముడిచారు!
- వరల్డ్ కప్ ఫైనలిస్టుల దీనగాథ!
వన్డే వరల్డ్‌కప్ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కంగారులు ఓటమిపాలయ్యారు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ వర్షం వెంటాడటం, ఓటమి తప్పకపోవడంతో ఆ జట్టు తట్టాబుట్టా సర్దుకొని ఇంటిముఖం పట్టింది. నిజానికి 2015 వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ అయిన న్యూజిలాండ్ కూడా చాంపియన్స్ ట్రోఫీలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన కివిస్ జట్టు ఇంటిముఖం పట్టింది. వరల్డ్ కప్ ఫైనలిస్టులు అయిన ఈ రెండు జట్లు చాంపియన్స్ ట్రోఫీలో కనీసం ఒక్క విజయం కూడా సాధించకపోవడం గమనార్హం.
చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును వర్షం దారుణంగా వెంటాడింది. వర్షం కారణంగా ఆ జట్టుకు సంబంధించిన రెండు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో మ్యాచుల్లో గెలిచే స్థితిలో వర్షం రావడంతో ఆసిస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 2009లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా..2013, 2017లో జరిగిన ఈ టోర్నమెంటులో ఒక్క మ్యాచ్ కూడా గెలువకపోవడం గమనార్హం. ఇక అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కివిస్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో వికెట్‌కు మహ్మదుల్లా, షకిబ్ ఆల్ హసన్ రికార్డుస్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో బంగ్లా జట్టు 268 పరుగులు సాధించి కివిస్ విసిరిన లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి వరల్డ్ కప్ ఫైనలిస్టులను తరిమేసి ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరాయి.