
షేన్ వార్న్.. ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కు సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. తమ జట్టును టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా లెక్కలేసుకున్న వార్న్ కు ఇప్పుడొక చిక్కొచ్చిపడింది. ఇందుకు కారణం శనివారం ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచే కారణం. ఆ మ్యాచ్ ను ఆసీస్ కచ్చితంగా గెలుస్తుందంటూ గొప్పలకు పోయిన వార్న్.. అందుకు సంబంధించి మన దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీతో 'బెట్టింగ్' కూడా కట్టాడు. ఇంతకీ ఆ బెట్టింగ్ ఏంటంటే.. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిచిన పక్షంలో వారి జెర్సీని గంగూలీ ధరించాలి. అదే సమయంలో ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు జెర్సీని తాను ధరిస్తానని వార్న్ పందెం కాసాడు.
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కొన్ని రోజుల క్రితం 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్న్, మైకేల్ క్లార్క్లు పాల్గొన్నారు. దానిలో భాగంగా జూన్18 వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్లో రెండు పటిష్టమైన జట్టు ఆస్ట్రేలియా-భారత్లు తలపడతాయంటూ క్లార్క్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే దీంతో గంగూలీ విభేదించాడు. ఫైనల్ తలపడే జట్టు భారత్-ఇంగ్లండ్లు అంటూ గంగూలీ జోస్యం చెప్పాడు. దాంతో కాసింత అసహనానికి లోనైన క్లార్క్.. ఇంగ్లండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారంటూ గంగూలీని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియా కంటే ఇంగ్లండ్ జట్టే అన్ని విభాగాల్లో ఉందంటూ గంగూలీ ఎటువంటి మొహం లేకుండా చెప్పేశాడు.
ఇది పక్కనే ఉన్న షేన్ వార్న్కు ఎంతమాత్రం రుచించలేదు. గ్రూప్-ఎ మ్యాచ్లో జూన్ 10 వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్లు తలపడుతున్నాయి కదా. ఇక్కడ ఆసీస్ గెలుస్తుందనేది తన బెట్ అంటూ వార్న్ సవాల్ విసిరాడు. ఆ మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే గంగూలీ తమ జట్టు జెర్సీ ధరించాలంటూ వార్న్ ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే ఇంగ్లిష్ జెర్సీని వేసుకుంటానని తనకు తానేగా పేర్కొన్నాడు. మరి ఇప్పుడు ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇంగ్లండ్ జెర్సీని వార్నర్ జెర్సీని ధరిస్తాడా?అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.