
ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
లండన్: దాయాదుల సమరం కోసం క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్తాన్ తలపడుతుండటంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో అభిమానుల కోలాహలం నెలకొంది. బిగ్‌ఫైట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు భారీ ఎత్తున స్టేడియంకు తరలిరావడంతో కిక్కిరిసింది.
డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, సర్ఫరాజ్ బృందం సంచలనాన్నే నమ్ముకుంది. తమ జట్లు చెలరేగాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. 2013 ఫలితం పునరావృతం అవుతుందని టీమిండియా వీరాభిమాని సుధీర్ గౌతమ్ అన్నాడు. కప్పు కోహ్లి సేనదేనని విశ్వాసం వ్యక్తం చేశాడు.
మరోవైపు కోహ్లి సేన విజయం సాధించాలని ఇండియా ఫ్యాన్స్ తమ దేశంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రార్థనలు నిర్వహించారు. కోహ్లి సేనకు మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మహా సమరంపై బెట్టింగులు కూడా జోరుగా జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.