
పాకిస్తాన్ కు భారీ లక్ష్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 320 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 320 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(91;119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లి(81 నాటౌట్;68 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (53; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ కు రెండుసార్లు వరుణుడు ఆటంకం కల్గించడంతో మ్యాచ్ ను 48.0 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఆదిలో ఎటువంటి భారీ షాట్లకు పోకుండా వికెట్లను కాపాడుకున్న ఓపెనర్లు రోహిత్-ధావన్లు నిలకడగా బ్యాటింగ్ చేశారు. దాదాపు సగం ఓవర్ల వరకూ క్రీజ్ను అంటిపెట్టుకున్న ఈ జోడి తొలి వికెట్ కు 136 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే రోహిత్ ముందుగా 72 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్ తో రోహిత్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ 48 బంతుల్లో ఐదు ఫోర్లుతో అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ధావన్ భారీ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత రోహిత్ మరింత నిలకడగా ఆడుతూ పాక్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనికి విరాట్ కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది.
కాగా, రోహిత్ సెంచరీకి చేరువుతున్న సమయంలో అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కోహ్లికి యువరాజ్ సింగ్ జత కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఒకవైపు కోహ్లి కుదురుగా ఆడితే, యువరాజ్ దాటిగా బ్యాటింగ్ చేశాడు. ముందుగా 59 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లి మరింత రెచ్చిపోయాడు. వరుసగా బౌండరీల మోత మోగిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక యువరాజ్ సింగ్ 29 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 93 పరుగులు జత చేసిన తరువాత యువరాజ్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్ లో వరుస మూడు సిక్సర్లతో చెలరేగి భారత్ స్కోరును మూడొందలు దాటించాడు. ప్రధానంగా చివరి 10 బంతుల్లో కోహ్లి-పాండ్యాలు 34 పరుగులను పిండుకోవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.