
జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన ఘనతను జడేజా సొంతం చేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీయడం ద్వారా భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
తద్వారా జహీర్ ఖాన్ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడిన జడేజా 16 వికెట్లు సాధించాడు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన జహీర్ 15 వికెట్ల ఘనతను సవరించాడు. ఆ తరువాత స్థానాల్లో హర్భజన్ సింగ్(14), సచిన్ టెండూల్కర్(14), ఇషాంత్ శర్మ(13), భువనేశ్వర్ కుమార్ (12)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే భారత్ ఖాతాలో మరో ఘనత చేరింది. ఈ టోర్నమెంట్లో 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో అత్యధిక వికెట్లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. భారత్ 19 వికెట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, పాకిస్తాన్ 18 వికెట్లతో రెండో స్థానంలో ఉంది.