నువ్వుంటే నేను ఉండను..!
లండన్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లికి అస్సలు పొసగడం లేనట్లే కనబడుతోంది. కోహ్లి-కుంబ్లేల మధ్య మాటల సంగతిని పక్కన పెడితే, వారిద్దరూ కనీసం ముఖాల్ని చూసుకోవడానికి కూడా ఇష్టంలేనంతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ వంటి ఒక ప్రధాన టోర్నీకి ముందు వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ పెద్దలు ఇంగ్లండ్ వెళ్లడానికి ప్రధాన కారణం కూడా ఇదేనట.
బంగ్లాదేశ్ తో రెండో వార్మప్ మ్యాచ్ ముగిసిన తరువాత భారత ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచ్ అనిల్ కుంబ్లే అక్కడికి వచ్చాడట. అప్పుడు కోహ్లి మైదానాన్ని వీడి లోపలకి వెళ్లిపోయాడట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. మైదానంలో కుంబ్లే ఉంటే తాను ఉండననే సంకేతాలు కోహ్లి ఇవ్వడంతోనే బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం గురువారం భారత ఆటగాళ్లతో అమితాబ్ చౌదరి, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం ఎంవీ శ్రీధర్‌లు భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటగాళ్ల నుంచి కుంబ్లే-కోహ్లిల ఎపిసోడ్ గురించి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే, కుంబ్లే-విరాట్ కోహ్లిల మధ్య చోటు చేసుకున్న విభేదాల వ్యవహారాన్ని బోర్డు సంయుక్త కారదర్శి అమితాబ్ చౌదరి ఖండించారు. ఆ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరికీ పడటం లేదనేది ఊహాజనితమేనంటూ కొట్టిపారేశారు. అయితే ఆటగాళ్లతో వారు భేటీ కావాల్సి రావడానికి కుంబ్లే-కోహ్లిల వ్యవహారమే కారణంగా వినిపిస్తోంది. ఆ తరువాతే కుంబ్లే-కోహ్లిల మధ్య ఎటువంటి విభేదాలు చోటుచేసుకోలేదని అమితాబ్ చౌదరి పేర్కొనడంతో వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లుగానే కనబడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ వరకూ మాత్రమే కుంబ్లే కోచ్ గా ఉండే తరుణంలో విభేదాలకు ఆస్కారం ఇచ్చి చులకన కావొద్దని అమితాబ్ చౌదరి హెచ్చరించినట్లు సమాచారం.