
కోహ్లి జట్టులోనే ఉన్నాడు.. మరి ఆయన కోచ్‌గా వస్తాడా!
Anil Kumble As Team India Coach.. టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దీనికి సంబంధించి బీసీసీఐ టి20 ప్రపంచకప్ తర్వాత దరఖాస్తులను కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లలో ఎవరో ఒకరిని ప్రధాన కోచ్ పదవి వరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి.
అయితే తాజాగా అనిల్ కుంబ్లే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ అతన్ని కోరినట్లు అనధికారిక రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఇంతకముందు అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లికి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై చాయిస్‌ను వెల్లడించిన లిటిల్ మాస్టర్
ఇక 2016లో ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. ఏడాది కాలానికి గానూ కుంబ్లే కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే 2017 జనవరిలో ధోని పరిమిత ఓవర్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడు. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్ అవడం జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగానే వెలుగుచూశాయి. కాగా కుంబ్లే, కోహ్లి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అప్పటి బీసీసీఐ సభ్యుడు వినోద్ రాయ్ కుంబ్లే వెస్టిండీస్ టూర్ వరకు ఆ పదవిలో ఉంటాడని తెలిపాడు. కాగా 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. తన కాంట్రాక్ట్‌కు ఇంకా సమయమున్నప్పటికీ 2017 జూన్ 20న కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోహ్లి రవిశాస్త్రిని ప్రధాన కోచ్ పదవి ఇవ్వాలని బీసీసీఐని కోరడం.. వెంటనే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది.
చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి
ఇప్పటికైతే కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. కోహ్లీతో విభేదాల కారణంగానే పదవికి రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు కోహ్లి జట్టులోనే ఉన్నాడు.. టి20 ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కుంబ్లేతో పాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే టి20 ప్రపంచకప్ ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే.