
Ravi Shastri Step Down Team India Coach: టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడని సమాచారం. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు కోచ్ పదవిలో ఉండాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవిశాస్త్రి మాత్రం టి20 ప్రపంచకప్ తర్వాతే వైదొలిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రవిశాస్త్రి తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేది ఎవరనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
చదవండి: T20 World Cup 2021: ఆ ఫలితాన్ని రిపీట్ చేస్తాం.. టీమిండియాపై పాక్ బౌలర్ వ్యాఖ్యలు
ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మాత్రం కోచ్ పదవి రాహుల్ ద్రవిడ్‌నే వరిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే టీమిండియా-ఏ జట్టు రాటు దేలడం.. ఆపై సీనియర్ టీమ్ గైర్హాజరీలో టీమిండియా రెండో టీమ్ శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేగాక టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని.. అతని సలహాలతో జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందనేది చాలా మంది అభిప్రాయం.
ఇక టీమిండియాకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ నిలిచాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు.. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ టీమిండియా గెలవడంతో కోచ్‌గా కిర్‌స్టన్ పాత్ర కీలకం. 2017లో కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాకా రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం.. కోహ్లి కెప్టెన్ కావడం.. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి టీమిండియాకు మంచి విజయాల్ని కట్టబెట్టారు. రవిశాస్త్రి కోచ్‌గా వచ్చిన తర్వాత కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను స్వదేశంతో పాటు వారి గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించింది.
దీంతోపాటు ఎన్నో సిరీస్‌ల్లోనూ వీరి జోడి పర్‌ఫ్టెక్ట్‌గా కనిపించింది. కోహ్లి కూడా రవిశాస్త్రి నిర్ణయాలతో ఏకీభవిస్తూ.. అతనికి మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. అయితే ఐసీసీ మేజర్ టోర్నీలకు వచ్చేసరికి మాత్రం రవిశాస్త్రి కోచ్‌గా సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్.. తాజాగా ఐసీసీ టెస్టు చాంపియన్ ఫైనల్లోనూ టీమిండియా అపజయాలే చూసింది. కేవలం ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లోనే కోచ్‌గా విఫలమయ్యాననే కారణంతో రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’
అయితే, కోచ్‌గా రవిశాస్త్రి తప్పుకుంటున్నాడనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. టి20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించే అవకాశం ఉంటుంది. అయితే ద్రవిడ్ మాత్రం ఎన్‌సీఏ చీఫ్ కోచ్‌గా ఉండడానికి ఈ మధ్యనే మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని గమనిస్తే.. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేయడానికి ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే రవిశాస్త్రి కోచ్‌గా వైదొలిగిన తర్వాత అతని టీమ్‌లోని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కూడా బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం.
ఒకవేళ టీమిండియాకు కొత్త కోచ్ వస్తే గనుక కొత్త టీమ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టి20 ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు ద్రవిడ్‌ను తాత్కాలిక కోచ్‌గా ఉంచి.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ జరిగే నాటికి కోచ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవేళ ద్రవిడ్ ఫుల్‌టైం ప్రధాన కోచ్‌గా ఉండేందుకు అంగీకరిస్తే మాత్రం బీసీసీఐకి ఇబ్బంది తొలగినట్టే. ఇక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టి20 ప్రపంచకప్ అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో రోహిత్ టెస్టు కెప్టెన్ అని రూమర్లు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment