కోహ్లి విజయరహస్యం చెప్పిన స్టార్ క్రికెటర్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ కోహ్లిని కట్టడి చేయడంపైనే పాకిస్తాన్ విజయావకాశాలు ఆధారపడివుంటాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్లపై ఒకడైన కోహ్లి, మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉందని, కానీ పాక్ బౌలర్లుగా ప్రధానంగా కోహ్లిపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. క్రీజులో విరాట్ కోహ్లి చేయి సిద్ధహస్తుడైన శస్త్ర నిపుణుడిలా ఉంటాడని పేర్కొన్నాడు.
‘ఆట కోసం కోహ్లి చాలా శ్రమిస్తాడు. ఎంత ఒత్తిడి ఉంటే అతడు అంత బాగా ఆడతాడు. బంతిని ఖాళీల్లోంచి కొట్టడంలో దిట్ట. ఎప్పుడు ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా ఉండడమే అతని విజయరహస్యం. ప్రపంచంలో అత్యద్భుతమైన క్రికెటర్ అతడే. కోహ్లి ఫామ్ ఇలాగే కొనసాగితే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా వరుస విజయాలు అందుకోవడం ఖాయమ’ని డివిలియర్స్ అన్నాడు.
కెరీర్ ఆరంభంలో కోహ్లి మైదానంలో దూకుడుగా ఉండేవాడని, కానీ ఇప్పుడు అరుదుగా మాత్రమే అతడు కోపంగా ఉంటున్నాడని పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా అతడు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నాడని ప్రశంసించాడు. కోహ్లి ఆట చూడటానికి ఎంతో ఇష్టపడతానని చెప్పాడు.