ఆర్సీబీ జట్టు (PC: RCB X)
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి.
సారథులు వీరేనా?
అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్‌కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు.
పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్‌స్టోన్‌లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.
మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆర్సీబీ కెప్టెన్ అతడే!
‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.
కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.
ఫామ్‌లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరు
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్‌తో అతడు అద్భుతాలు చేయగలడు.
ఒకవేళ ఎంగిడి ఫిట్‌గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment