చహల్ (PC: RCB/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలం నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా బాగానే ఉందని.. అయితే వేలంపాటలో అనుసరించే వ్యూహాలపైనే అంతా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి జట్టుతోనే ఉండటం సంతోషకరమన్న ఏబీడీ.. చహల్‌ను కూడా తిరిగి తీసుకువస్తే జట్టు మరింత బలోపేతమవుతుందన్నాడు.
కాగా నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో మెగా వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
ఇక ఆర్సీబీ తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(రూ. 21 కోట్లు)తో పాటు రజత్ పాటిదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(రూ. 5 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో రిటెన్షన్ పోగా.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ. 83 కోట్లు మిగిలి ఉన్నాయి.
ఈ నలుగురిని కొంటే ఆర్సీబీ రాత మారుతుంది
ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ వేలంలో ఆర్సీబీ అనుసరించాల్సిన వ్యూహాలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనైతే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తాను. యజువేంద్ర చహల్, కగిసో రబడ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్... ఈ నలుగురిని కొనుగోలు చేసిన తర్వాత పర్సులో ఎంత మిగిలిందన్న అంశం ఆధారంగా మిగతా ప్లేయర్లను ప్లాన్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు రబడను కొనేంత సొమ్ము లేకపోతే.. మహ్మద్ షమీని దక్కించుకోండి’’ అని డివిలియర్స్ ఆర్సీబీ యాజమాన్యానికి సూచించాడు. కాగా సుదీర్ఘకాలం పాటు తమతో కొనసాగిన భారత మణికట్టు స్పిన్నర్ చహల్‌ను 2022లో ఆర్సీబీ వదిలేసిన విషయం తెలిసిందే.
లీడింగ్ వికెట్ టేకర్
అయితే, అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ చహల్‌ను కొనుక్కోగా.. అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 160 మ్యాచ్‌లు ఆడి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(295) తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు చహల్.
ఈ నేపథ్యంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ తిరిగి జట్టులో చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరినా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment