'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్ని కచ్చితంగా కోరుకుంటుందని కొనియాడాడు. ఈ విషయం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వంటి వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ ప్రస్తావించాడు.
' బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ల్లో స్టోక్స్ ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. నిన్నటి మ్యాచ్ లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్ లో కూడా మెరిశాడు. బ్యాటింగ్ లో సెంచరీతో అదరగొట్టాడు. మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టం. ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అతని లాంటి ఆటగాడ్ని ఏ జట్టైనా కోరుకుంటుంది'అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో బెన్ స్టోక్స్ (109 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.