
'ఆ జట్టే భారత్ కు గట్టి ప్రత్యర్థి'
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్ ను సాధించడం ఖాయమని అంటున్నాడు
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ మరోసారి టైటిల్ ను సాధించడం ఖాయమని అంటున్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన తరువాత భారత్ కు ఎదురే లేదనేది స్పష్టమవుతుందన్నాడు.
అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు కఠినమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది దక్షిణాఫ్రికా జట్టేనని రాజ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. అయితే సౌతాఫ్రికాను సైతం మట్టికరిపించి టైటిల్ ను గెలిచే సత్తా భారత్ ఉందన్నాడు. 'చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా జట్టు చాలా పటిష్టంగా ఉంది. భారత్ కు ఆ జట్టే కఠినమైన ప్రత్యర్ధి. ఆ జట్టును కూడా ఓడించి టైటిల్ మరోసారి సత్తా విరాట్ సేనలో ఉంది. కచ్చితంగా మనమే చాంపియన్స్ గా నిలుస్తాం. అటు ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లతో పాటు, యువరాజ్ సింగ్-విరాట్ కోహ్లిల తమను మరోసారి నిరూపించుకున్నారు. క్లాస్ ఎప్పుడూ శాశ్వతమనేది వీరు నిరూపించారు. ప్రస్తుత ఆటను చూస్తే భారత జట్టుకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి' అని రాజ్ కుమార్ పేర్కొన్నాడు.