'ఫైనల్లో పాక్ ను తేలిగ్గా తీసుకోవద్దు'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ పోరులో భారత్-పాకిస్తాన్ తలపడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా ఒకవైపు.. తొలి సారి టైటిల్ ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ మరొకవైపు.. వెరసి ఇరు జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ భారత్ టైటిల్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయకూడదనేది మాజీల అభిప్రాయం. టైటిల్ పోరులో పాకిస్తాన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ.
రేపటి(ఆదివారం) ఫైనల్లో భారత్ ఫేవరెట్. అయితే పాకిస్తాన్ ను తక్కువగా అంచనా వేయకండి. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు వచ్చిన క్రమం ప్రతీజట్టును ఆశ్చర్యంలో ముంచెత్తింది. వన్డే ర్యాంకింగ్ లో ఎనిమిదో స్థానం ఉన్న పాకిస్తాన్ అంచనాలకు మించి ప్రదర్శన చేసింది. పాక్ కు ప్రతీ గేమ్ నాకౌట్ గా మారిన తరుణంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ పై పాక్ కు మెరుగైన రికార్డు లేకపోవచ్చు..కానీ చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు భారత్ ను ఓడించిన ఘనత పాక్ ది. దాంతో భారత్ జాగ్రత్తగా ఆడితేనే టైటిల్ ను నిలబెట్టుకుంటుంది'అని హస్సీ తెలిపాడు.