
తమీమ్ శతక్కొట్టుడు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్నఆరంభపు వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. ఆది నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచిన తమీమ్ శతకంతో మెరిశాడు. అతనికి ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీతో చక్కటి సహకారం అందివ్వడంతో బంగ్లాదేశ్ 39.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ లు ఆరంభించారు. అయితే బంగ్లాదేశ్ స్కోరు 56 పరుగుల వద్ద సౌమ్య సర్కార్(28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై ఇమ్రూల్ కైస్(19) కూడా నిరాశపరిచాడు. ఆ తరుణంలో ఇక్బాల్ కు జత కలిసిన రహీమ్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ క్రమంలోనే తమీమ్ ఇక్బాల్ సెంచరీ చేయగా, రహీమ్ హాఫ్ సెంచరీలతో మెరిశాడు.