రోహిత్-ధావన్లు నాల్గోసారి..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి మెరిసింది. గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్-ధావన్లు సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక్కడ రోహిత్ సిక్సర్ తో హాఫ్ సెంచరీ మార్కును చేరడం విశేషం. అంతకుముందు పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా సిక్సర్ తోనే రోహిత్ శర్మ అర్థశతకం నమోదు చేశాడు. మరోవైపు శిఖర్ ధావన్ 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇదే చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, రోహిత్-ధావన్ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జో్డిగా సరికొత్త ఘనత సాధించింది. ఈ టోర్నీలో రెండు సెంచరీ భాగస్వామ్యాలతో పాటు అంతకుముందు ఆస్ట్రేలియాతో్ ఆడిన వన్డేలో శిఖర్-రోహిత్ ల జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.