
కోహ్లి ఫిదా.. కార్తీక్‌కు బంపర్ చాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ రెండో వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్టైలిష్‌గా 94 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌కు అన్నీ కలిసి వస్తున్నాయి.
లండన్: చాంపియన్స్ ట్రోఫీ రెండో వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్టైలిష్‌గా 94 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌కు అన్నీ కలిసి వస్తున్నాయి. అన్నీ కుదిరితే అతను జూన్ 4న జరగనున్న భారత్-పాకిస్థాన్ పోరులో ఆడే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాపై అతని ఆటతీరుతో ఫుల్ ఫిదా అయిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈమేరకు బలమైన సంకేతాలు ఇచ్చాడు. అందరు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం తుదిజట్టులోకి దినేశ్ కార్తిక్‌ను తీసుకునే అవకాశముందని చెప్పాడు.
చాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని డిఫెండింగ్ చాంపియన్ అయిన టీమిండియా కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా జరిగిన రెండు వార్మప్ మ్యాచుల్లోనూ విజయం సాధించడంతో టీమిండియా ధీమాగా ఉంది.
‘ఆడిన రెండు మ్యాచుల్లోనే మేం కోరుకున్నది సాధించాం. బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. ఆకాశంలో మేఘాలు కమ్మినప్పుడు పరుగులు రాబట్టడం అంత సులభం కాదు’ అని కోహ్లి అన్నాడు. రెండో వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై 240 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడంపై కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ లోయర్ ఆర్డర్‌లో బాగా ఆడుతున్నారు. దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటగాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లలో మేం అన్నీ అవకాశాలు వినియోగించుకున్నామని కోహ్లి చెప్పాడు.