శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.
ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్‌కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
తమ సొంతపిచ్‌లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్‌లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు.
"ఈ సిరీస్‌లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని.
అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్‌లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.
అన్ని పిచ్‌లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment