IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు! | This Is Why They Have Not Won IPL For 16 Years: Ambati Rayudu on RCB | Sakshi
Sakshi News home page

RCB: ‘స్టార్లు’ ఉంటే ఏం లాభం?.. ఆర్సీబీ లాంటి జట్లు ట్రోఫీ గెలవలేవు: రాయుడు సంచలన కామెంట్స్‌

Published Wed, Apr 3 2024 11:45 AM | Last Updated on Wed, Apr 3 2024 4:24 PM

This Is Why They Have Not Won IPL For 16 Years: Ambati Rayudu on RCB - Sakshi

ఆర్సీబీ ముఖచిత్రంగా నీరాజనాలు అందుకుంటున్న విరాట్‌ కోహ్లి(PC: RCB X)

"This is why they have not won the IPL for so many years": రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదని వ్యాఖ్యానించాడు.

కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్‌ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదన్న విషయం తెలిసిందే. 

విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుపెస్లిస్‌, మహ్మద్‌ సిరాజ్‌ వంటి టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్‌-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది.

ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో 28 రన్స్‌తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది.

స్టార్లు ఒక్కసారైనా రాణించారా?
ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు.

ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్‌గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్‌ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ సాధించలేకపోయింది.

బిగ్‌ ప్లేయర్లంతా టాపార్డర్‌లో ఉంటారు. కేక్‌ తినగా మిగిలిన క్రీమ్‌ను వదిలేసినట్లు డౌన్‌ ఆర్డర్‌లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్‌ కార్తిక్‌ మాత్రమే ఆడటం చూస్తున్నాం.

పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే
ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్‌ రూంలోనే ఉంటారు. 

ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్‌ వెల్‌, డుప్లెసిస్‌, ​కామెరాన్‌ గ్రీన్‌ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. 

ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో!
అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్‌ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్‌ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు.

కాగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్‌ తర్వాత ఐపీఎల్‌కు అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement