విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో విలియమ్సన్ అర్ద శతకం నమోదు చేశాడు. కివీస్ 69 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 58 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధ శతకం సాధించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు 27 ఓవర్లలో రెండు వికెట్లకు 144 పరుగులు చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు మార్టిన్ గప్టిల్(33),రోంచీ(16)లు దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 46 పరుగుల వద్ద రోంచీ తొలి వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికి గప్టిల్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ దశలో విలియమ్సన్-రాస్ టేలర్ల జోడి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో సెంచరీ సాధించిన విలియమ్సన్.. ఆపై ఇంగ్లండ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.