కొలంబో: ప్రతి రోజూ ఏదో ఒక దశలో వర్షం అంతరాయం కలిగించినా... చివరి రోజు అందివచ్చిన సమయంలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. ఫలితంగా శ్రీలంకతో జరిగిన చివరిదైన రెండో టెస్టులో విలియమ్సన్ బృందం ఇన్నింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సెంచరీ హీరో లాథమ్ (154) నిలిచాడు. అరగంట ఆలస్యంగా... ఓవర్ నైట్ స్కోరు 382/5తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో వికెట్ నష్టపోయి 431 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గ్రాండ్‌హోమ్ ఓవర్ నైట్ స్కోర్ (83) వద్దే ఔటైనా మరో ఎండ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (105 నాటౌట్; 9 ఫోర్లు) శతకం పూర్తి చేసుకున్నాడు.
185 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 70.2 ఓవర్లలో 122 పరుగులకు కుప్పకూలింది. సౌతీ, బౌల్ట్, ఎజాజ్ పటేల్, సోమర్‌విల్లె రెండేసి వికెట్లు తీశారు. గాయం కారణంగా దిముత్ కరుణరత్నే స్థానంలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కుశాల్ పెరీరా (0), తిరిమన్నె (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఒక దశలో 32 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డిక్‌వెల్లా (51; 6 ఫోర్లు), సారథి కరుణరత్నే (21) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 41 పరుగులు జోడించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేలా కనిపించారు. అయితే కరుణరత్నేను సౌతీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం, కాసేపటికే ఒంటరి పోరాటం చేస్తున్న డిక్‌వెల్లాను స్పిన్నర్ ఎజాజ్ పటేల్ పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment