విలియమ్సన్, వాట్లింగ్ రికార్డు
న్యూజిలాండ్ 524/5 డిక్లేర్డ్ శ్రీలంక లక్ష్యం 390
వెల్లింగ్టన్: విలియమ్సన్ (438 బంతుల్లో 242 నాటౌట్; 18 ఫోర్లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అటు వాట్లింగ్ (333 బంతుల్లో 142 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 365 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితికి చేరింది.
విలియమ్సన్, వాట్లింగ్‌ల అత్యద్భుత ఆటతీరుతో మంగళవారం నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో లంకకు 390 పరుగుల భారీ లక్ష్యం ఎదురయింది. బుధవారం ఆటకు చివరి రోజు.
మూడో రోజు ఆటలో విలియమ్సన్ రెండు క్యాచ్‌లను మిస్ చేసిన లంక ఫీల్డింగ్ నాలుగో రోజు కూడా అదే రీతిన సాగింది. తను 104 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ ప్రసన్న జయవర్ధనే క్యాచ్ వదిలేయగా... 233 వద్ద ఉన్నప్పుడు స్టంప్ చేయలేకపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మంగళవారం ఆట మగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.