ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు | India Win Super Over Lead In T20 Series | Sakshi
Sakshi News home page

ఉత్కం‘టై’న మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు

Published Thu, Jan 30 2020 1:17 AM | Last Updated on Thu, Jan 30 2020 1:26 PM

India Win Super Over Lead In T20 Series  - Sakshi

‘ఆఖరి పంచ్‌ మనదైతే... వచ్చే కిక్కే వేరబ్బా’ ఇది బాగా పాపులర్‌  డైలాగ్‌. ఇక్కడ పొట్టి మ్యాచ్‌లో ఆ పంచ్‌ కివీస్‌కు పడింది. కిక్‌ భారత్‌కు ఎక్కింది. ఈ డైలాగ్‌ను హీరో అంటుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆస్వాదిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఈ మ్యాచ్‌ చూసినోళ్లకు అనిపించక మానదు.

నిజమే... మ్యాచ్‌ అంటే ఇది. మలుపులంటే ఇవి. మెరుపులంటే మావే అన్నట్లు ఇరు జట్లను ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌కు ఎవరూ ఊహించని ఫినిషింగ్‌ లభించింది. కోట్లాది అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టిన పోరు సిక్సర్లతో హోరెత్తింది.

హామిల్టన్‌: ఒకతను ఆపేశాడు. మరొకతను బాదేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ల దెబ్బకు కివీస్‌ తలకిందులైంది. రెండుసార్లు ఊహకందని విధంగా అంచనాలు తారుమారయ్యాయి. ఎంచక్కా గెలుస్తుందిలే అనుకుని ఆఖరి మజిలీకి చేరిన న్యూజిలాండ్‌ను తొలుత పేసర్‌ షమీ అడ్డుకున్నాడు. మ్యాచ్‌ ‘టై’ అయింది. సూపర్‌ ఓవర్‌ మొదలైంది. ఇక్కడా విజయావకాశాలు కివీస్‌నే ఊరిస్తే... రోహిత్‌ సిక్సర్లతో మార్చేశాడు. ఈ రెండు దెబ్బలకు భారత్‌ మూడో టి20లోనూ గెలవడంతో పాటు... ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే 3–0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌కు ఇదే తొలి పొట్టి సిరీస్‌ కావడం విశేషం. గతంలో రెండు సార్లు ఆతిథ్య జట్టుకే సిరీస్‌ సమర్పించుకుంది. ఆఖరిదాకా అత్యుత్తమ పోరాటం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ సూపర్‌ ఓవర్లో గెలుపొందింది.

మొదట భారత్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్‌ కోహ్లి (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించారు. బెన్నెట్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కివీస్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి సరిగ్గా 179 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 95; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేశాడు. కానీ ఒత్తిడిని ఎదుర్కోలేక చిత్తయ్యాడు. శార్దుల్, షమీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ‘సిక్సర’ పిడుగు రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. నాలుగో టి20 శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.

దంచేసిన రోహిత్‌...
టాస్‌ నెగ్గిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన రోహిత్‌ భారత ఇన్నింగ్స్‌కు మూలస్తంభమయ్యాడు. రాహుల్‌తో కలిసి చకచకా పరుగులు జత చేశాడు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్‌ 50 పరుగులకు చేరింది. బెన్నెట్‌ వేసిన ఈ ఓవర్‌ను రోహిత్‌ 1, 6, 6, 4, 4, 6తో దంచేశాడు. ఇందులో ఆ ఒక్కటీ రాహుల్‌దైతే... విధ్వంసం రోహిత్‌ది. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 27 పరుగులు లభించాయి. రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ 23 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది.

ధాటిగా సాగిపోతున్న ఈ ఓపెనింగ్‌ జోడీని ఎట్టకేలకు రాహుల్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌)ని ఔట్‌చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్‌ విడగొట్టాడు.89 పరుగుల వద్ద తొలివికెట్‌ను కోల్పోయిన భారత్‌ మరో 7 పరుగుల వ్యవధిలో రోహిత్, శివమ్‌ దూబే (3) వికెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్లో బెన్నెట్‌ ఆ ఇద్దరి వికెట్లను పడేశాడు. తర్వాత కెపె్టన్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 17; 1 ఫోర్‌), మనీశ్‌ పాండే (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్‌) జట్టు స్కోరు పెంచే ప్రయత్నం చేశారు.

విలియమ్సన్‌ వీరోచితం...

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ కూడా వేగంగానే పరుగులు జతచేసింది. బుమ్రా బౌలింగ్‌లో గప్టిల్‌ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ ధాటిలో మన్రో (14; 2 ఫోర్లు) వెనుకబడ్డాడు. గప్టిల్‌ జోరుకు శార్దుల్‌ తెరదించగా, మన్రోను జడేజా అవుట్‌ చేశాడు. ఆరో ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరినా... కీలక వికెట్లను కోల్పోయింది. అయినప్పటికీ కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాత్రం క్రీజులోకి వచ్చినప్పటినుంచే దంచేసే పనిలో పడ్డాడు. బుమ్రా, చహల్, షమీ, జడేజా ఎవరు బౌలింగ్‌కు దిగినా బౌండరీలు, సిక్సర్లు బాదకుండా విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే అతను 28 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.

12.4 ఓవర్లలో జట్టు స్కోరు వందకు చేరింది. సాన్‌ట్నర్‌ (9), గ్రాండ్‌హోమ్‌ (5) తక్కువ స్కోర్లకే నిష్క్రమించినా ...కెప్టెన్ దూకుడుతో ఆ ప్రభావం స్కోరుపై పడలేదు. జోరును ఆపలేదు! టేలర్‌ (10 బంతుల్లో 17; 1 ఫోర్, 1  సిక్స్‌) అండతో కేన్‌ జట్టును విజయతీరాలకు తీసుకొచ్చాడు. సెంచరీకి అతను, విజయానికి జట్టు చేరువైనా... షమీ అద్భు త బౌలింగ్‌తో ఏ ఒక్కటీ జరగలేదు. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన 20వ ఓవర్‌ను వైవిధ్యమైన బంతులతో నియత్రించాడు. ఆఖరి 4 బంతుల్లో అయితే వాళ్లిద్దరినీ ఔట్‌ చేసిన షమీ ఒక పరుగు మాత్రమే ఇవ్వడంతో స్కోరు సమమై మ్యాచ్‌ ‘టై’ అయింది. ఈ మ్యాచ్‌లో రో‘హిట్స్‌’, షమీ బౌలింగ్‌తో భారత్‌ గెలిచినప్పటికీ ఫీల్డింగ్‌లో తడబడింది. విలువైన క్యాచ్‌లు చేజార్చిన భారత ఫీల్డర్లు దూబే, జడేజా చిత్రంగా తేలికపాటి బౌండరీల్ని ఆపలేకపోయారు. దీంతో ఒక పరుగొచ్చే చోట 4 పరుగులు ప్రత్యర్థి స్కోరుకు జతయ్యాయి.

షమీ ఆఖరి ఓవర్లో ఆపేశాడు...

ఆఖరి ఓవర్‌ వేసిన షమీ కివీస్‌ను ఆపేశాడు. అద్భుతమైన బౌలింగ్‌తో గెలుపు దారిని మూసేశాడు. 6 బంతుల్లో 9 పరుగులతో గెలిచే చోట తొలి రెండు బంతులకు సిక్స్‌ సహా 7 పరుగులిచ్చాడు. మిగిలిన బంతులు నాలుగైతే.. చేయాల్సిన పరుగులు రెండే! కానీ షమీ ఇచ్చింది ఒకటే పరుగు. తీసింది రెండు వికెట్లు. మూడో బంతికి విలియమ్సన్, ఆఖరి బంతికి రాస్‌ టేలర్‌ ఔట్‌. మ్యాచ్‌ ‘టై’...

రోహిత్‌ ఆఖరి బంతుల్లో ఆరేశాడు...
సూపర్‌ ఓవర్లో భారత్‌ విజయానికి 18 పరుగులు చేయాలి. కానీ రోహిత్, రాహుల్‌ ఇద్దరు చెరో 2 బంతులాడి ఎనిమిదే చేశారు. ఇక గెలవాలంటే చివరి రెండు బంతుల్లో 10 చేయాలి. క్రీజ్‌లో ‘హిట్‌మ్యాన్‌’ ఉన్నాడు. సౌతీ యార్కర్‌ ప్రయత్నం విఫలం కాగా... రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. లాంగాన్‌లో సిక్స్‌. ఆఖరి బంతికి 4 కావాలి. ఈసారి లాంగాఫ్‌లో సిక్స్‌. అంతే భారత్‌కు మూడో మ్యాచ్‌ గెలుపుతో పాటు సిరీస్‌ కూడా దక్కింది.

►6 ఇప్పటివరకు టి20ల్లో ఆరుసార్లు, వన్డేల్లో ఒకసారి కలిపి న్యూజిలాండ్‌ జట్టు మొత్తం ఏడుసార్లు సూపర్‌ ఓవర్‌ ఆడింది. అయితే ఆరుసార్లు న్యూజిలాండ్‌ జట్టుకు పరాజయమే ఎదురైంది.  

►న్యూజిలాండ్‌ తరఫున టిమ్‌ సౌతీ ఐదుసార్లు సూపర్‌ ఓవర్‌ వేశాడు. ఇందులో నాలుగుసార్లు ఓడిపోవడం గమనార్హం.

►ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్‌ప్రీత్‌ బుమ్రా మూడుసార్లు సూపర్‌ ఓవర్‌ వేయగా... మూడుసార్లూ అతని జట్టునే విజయం వరించింది. ఐపీఎల్‌లో 2017లో గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేశాడు.  

►న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ టి20 సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌లో భారత్‌ 2009లో 0–2తో... 2019లో 1–2తో టి20 సిరీస్‌లను చేజార్చుకుంది.   

ఒక దశలో ఓటమి ఖాయమనుకున్నా. కేన్‌ బాగా ఆడాడు. కానీ దురదృష్టం. సెంచరీకి చేరువై 95 దగ్గర ఔటైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. చివరి బంతినెలా వేయాలనే దానిపై తర్జనభర్జన పడ్డాం. వికెట్లకు సూటిగా వేస్తే సరే కానీ... బ్యాట్‌కు తగిలితే ఆ ఒక్క పరుగు ఎలాగైనా వస్తుందనే బెంగ కూడా ఉంది. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో, సూపర్‌ ఓవర్లో చెలరేగాడు. అతనొక బంతిపై విరుచుకుపడితే మరో బంతి వేసే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడని అనుకున్నాం. సిరీస్‌ గెలిచాం. ఇక క్లీన్‌ స్వీపే మా లక్ష్యం.
–భారత కెప్టెన్ కోహ్లి  

నేనెప్పుడూ సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితి. తొలి బంతినుంచే బాదాలా లేక సింగిల్‌ తీయాలో కూడా తెలియదు. కానీ మొత్తానికి మంచి ప్రదర్శన కనబరిచాను. చాలాసేపు క్రీజులో ఉండాలని భావించిన నేను అలా ఔట్‌ కావడం కాస్త నిరాశపరిచింది.
–భారత ఓపెనర్‌ రోహిత్‌

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)సౌతీ (బి) బెన్నెట్‌ 65; రాహుల్‌ (సి) మన్రో (బి) గ్రాండ్‌హోమ్‌ 27; దూబే (సి) సోధి (బి) బెన్నెట్‌ 3; కోహ్లి (సి) సౌతీ (బి) బెన్నెట్‌ 38; అయ్యర్‌ (స్టంప్డ్‌) సిఫెర్ట్‌ (బి) సాన్‌ట్నర్‌ 17; పాండే (నాటౌట్‌) 14; జడేజా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–89, 2–94, 3–96, 4–142, 5–160.
బౌలింగ్‌: సౌతీ 4–0–39–0, బెన్నెట్‌ 4–0–54–3, కుగెలెజిన్‌ 2–0–10–0, సాన్‌ట్నర్‌ 4–0–37–1, సోధి 4–0–23–0, గ్రాండ్‌ హోమ్‌ 2–0–13–1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) సబ్‌–సామ్సన్‌ (బి) శార్దుల్‌ 31; మన్రో (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) జడేజా 14; విలియమ్సన్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 95; సాన్‌ట్నర్‌ (బి) చహల్‌ 9; గ్రాండ్‌హోమ్‌ (సి) దూబే (బి) శార్దుల్‌ 5; టేలర్‌ (బి) షమీ 17; సిఫెర్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–47, 2–52, 3–88, 4–137, 5–178, 6–179. బౌలింగ్‌: శార్దుల్‌ 3–0–21–2, షమీ 4–0–32–2, బుమ్రా 4–0–45–0, చహల్‌ 4–0–36–1, జడేజా 4–0–23–1, దూబే 1–0–14–0.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement