
చాంపియన్స్ ట్రోఫీకి క్రిస్ వోక్స్ దూరం
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసిన ఇంగ్లండ్ ను అప్పుడే గాయాల బెడద వేధిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో పక్కటెముకలు పట్టేయడంతో వోక్స్ టోర్నీ నుంచి దూరమయ్యాడు. అతనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.
మరొకవైపు నిన్నటి మ్యాచ్ లో సెంచరీతో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించిన జో రూట్ కు కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఇయాన్ మోర్గాన్ తో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతో అతని కండరాలు పట్టేశాయి. దాంతో అతను తదుపరి మ్యాచ్ లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. జో రూట్ ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అతను పాల్గొంటాడు.