చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్..
2023 జులై నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ గెలుచుకుంది. ఆష్లే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును వరుసగా రెండు నెలలు (జూన్, జులై) గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆష్లేకు ఇది నాలుగో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కావడం విశేషం. జులై నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసిన ఆష్లే వరుసగా రెండో నెల కూడా ఐసీసీ అవార్డును గెలుచుకుంది.
జులై నెలకు గాను పురుషుల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు. జులై నెలలో కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను వోక్స్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం నెదర్లాండ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్, ఇంగ్లండ్‌కే చెందిన జాక్ క్రాలే పోటీపడినప్పటికీ వోక్స్‌నే ఈ అవార్డు వరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు మరియు మీడియా ప్రతినిధులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ నుండి సేకరించిన ఓట్ల ఆధారంగా వోక్స్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్న వోక్స్.. ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు. వోక్స్‌కు పోటీదారులైన జాక్ క్రాలే, బాస్ డి లీడ్ కూడా జులై నెలలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ వారికి నిరశే ఎదురైంది.
క్రాలే జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.
బాస్ డి లీడ్ విషయానికొస్తే.. ఈ నెదర్లాండ్స్ యువ ఆల్‌రౌండర్ జులైలో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించాడు. టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనను (5/52, 123 (92 బంతుల్లో)) కనబర్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment