Womens Ashes 2023: Ecclestone The Benchmark, But Gardner Turns Test Towards Australia - Sakshi
Sakshi News home page

Womens Ashes 2023: రసవత్తరంగా యాషెస్‌ టెస్ట్‌.. ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదా..?

Published Mon, Jun 26 2023 10:23 AM | Last Updated on Mon, Jun 26 2023 11:13 AM

Womens Ashes: Ecclestone The Benchmark But Gardner Turns Test Towards Australia - Sakshi

మహిళల యాషెస్‌ ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు రెండు సెషన్లు పూర్తియ్యాక కూడా డ్రా అయ్యేలా కనిపించిన ఈ మ్యాచ్‌.. ఒక్కసారిగా మలుపు తిరిగి ఆసీస్‌వైపు మళ్లింది. ఆష్లే గార్డ్‌నర్‌ (3/33) తన స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఇరుకునపడేసి, ఆసీస్‌వైపు మ్యాచ్‌ను మలుపు తిప్పింది. పురుషుల యాషెస్‌ తొలి టెస్ట్‌ తరహాలోని ఈ మ్యాచ్‌ కూడా సాగుతుండటంతో ఇంగ్లండ్‌కు పరాభవం తప్పదని నెటిజన్లు అనుకుంటున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నాలుగో రోజు సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌.. సోఫీ ఎక్లెస్టోన్‌ (5/63) మరోసారి విజృంభించడంతో 257 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో బెత్‌ మూనీ 85 పరుగులు సాధించగా.. కెప్టెన్‌ హీలీ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటైంది. తొలి ఇన్నింగ్స్‌ స్వల్ప ఆధిక్యం (10) కలుపుకుని ఆసీస్‌.. ఇంగ్లండ్‌కు 268 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. 

అనంతరం నాలుగో రోజు మూడో సెషన్‌లో లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే తొలి ఇన్నింగ్స్‌ డబుల్‌ సెంచరీ స్టార్‌ ట్యామీ బీమౌంట్‌ను (22) ఆష్లే గార్డ్‌నర్‌ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్‌ ఒక్కసారిగా లయ తప్పి వరుసగా వికెట్లు కోల్పోయింది. గార్డ్‌నర్‌ 3, కిమ్‌ గార్త్‌, తహిళ మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్‌ గెలుపుకు కేవలం ఐదు వికెట్లు మాత్రమే అవసరంగా ఉన్నాయి. క్రీజ్‌లో డేనియల్‌ వ్యాట్‌ (20), కేట్‌ క్రాస్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 473 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ 463 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎల్లైస్‌ పెర్రీ (99) పరుగు తేడాతో శతకం మిస్‌ చేసుకోగా.. సదర్‌లాండ్‌ (137) అజేయమైన సెంచరీతో సత్తా చాటింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ ఎక్లెస్టోన్‌ 5 వికెట్లతో విజృంభించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ట్యామీ బీమౌంట్‌ (208) డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. హీథర్‌ నైట్‌ (57), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (78) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్‌ బౌలర్‌ గార్డ్‌నర్‌ 4, తహిళ మెక్‌గ్రాత్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ 10 వికెట్లు పడగొట్టగా, బీమౌంట్‌ డబుల్‌ సెంచరీతో మెరిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement