నాటింగ్‌హమ్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. మూడు ఫార్మాట్ల ఫలితాలతో విజేత ఖరారయ్యే ఈ సిరీస్‌లో ఆసీస్ అమ్మాయిలు ఏకైక టెస్టులో గెలిచి ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఈ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే తదుపరి జరిగే ఆరు మ్యాచ్‌ల్లో (మూడు టి20లు, మూడు వన్డేలు) ఐదింట గెలవాలి. సోమవారం ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డ్‌నర్ (8/66) ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. భారత స్పిన్నర్ నీతూ డేవిడ్ (8/53; 1995లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆష్లే నిలిచింది.
268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు 116/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే ఆలౌటైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 178 పరుగుల వద్ద ముగిసింది. నాలుగో రోజు ఆటలోనే 3 కీలక వికెట్లు తీసిన ఆష్లే చివరి రోజు ఉదయం మరో ఐదు వికెట్లను పడగొట్టింది. ఈ టెస్టులో ఆమె మొత్తం 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4) పడగొట్టింది. తద్వారా మహిళల టెస్టు చరిత్రలో రెండో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఈ జాబితాలో పాక్ బౌలర్ షాయిజా ఖాన్ (2004లో విండీస్‌పై 13 వికెట్లు) అగ్రస్థానంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ 473, ఇంగ్లండ్ 463 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆ్రస్టేలియా 257 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment