మల్టీ ఫార్మట్ మహిళల యాషెస్ సిరీస్‌లో ఆతిధ్య ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుంది. ఈ సిరీస్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఇంగ్లండ్.. ఆతర్వాత పుంజుకుని 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 3 వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ (81 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ (41), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (34), జొనాస్సెన్ (30) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్ చెరో 2 వికెట్లు.. కేట్ క్రాస్, ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అలైస్ క్యాప్సీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. హీథర్ నైట్ (75 నాటౌట్), ట్యామీ బేమౌంట్ (47), అలైస్ క్యాప్సీ (40), నాట్ సీవర్ బ్రంట్ (31) రాణించడంతో 48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ 3, జార్జియా వేర్హమ్ 2, ఎల్లైస్ పెర్రీ, మెగాన్ షట్, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జులై 16న జరుగనుంది.
లక్ష్య ఛేదనలో రికార్డు..
ఈ మ్యాచ్‌లో 264 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఇంగ్లండ్.. లక్ష్య ఛేదనలో తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గతంలో ఇంగ్లండ్ అత్యధిక లక్ష్యఛేదన రికార్డు 245/7గా ఉండింది. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ రికార్డు సాధించింది. యాషెస్ తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ వన్డేల్లో తొలిసారి 250 పరుగులకు పైబడిన లక్ష్యాన్ని ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment