
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములను చవిచూసింది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అనికేత్ వర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్(32), హెడ్(22) పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధించారు.
అనంతరం బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ తేలిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(38), అభిషేక్ పోరెల్(34) రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫలమ్యే తమ ఓటమికి కారణమని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు.
"మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. తొలుత స్కోర్ బోర్డులో తగనన్ని పరుగులు ఉంచలేకపోయాము. కొన్ని తప్పు షాట్లు ఆడి మా వికెట్లను కోల్పోయాము. డీప్‌లో క్యాచ్‌లు అందుకోవడం ఈ ఫార్మాట్‌లో సర్వ సాధారణమే. ఇదే మా ఓటమికి కారణమని నేను అనుకోను. గత రెండు మ్యాచ్‌ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. కచ్చితంగా ఈ ఓటములపై సమీక్ష చేస్తాము.
మాకు అందుబాటులో ఉన్న అప్షన్స్‌ను పరిశీలిస్తాము. అనికేత్ వర్మ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌కు కూడా డొమాస్టిక్ క్రికెట్‌లో అతడు తన ప్రదర్శనతో అందరని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఇక్కడ కొనసాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా అతడు తన బ్యాటింగ్‌తో మైమరిపించాడు.
ఈ రెండు ఓటములపై మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..