'చాంపియన్స్' ఎవరు?
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ తో భారత్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి.. పాకిస్తాన్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అంతిమ సమరంలో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవుతుండగా, పాకిస్తాన్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ మొహ్మద్ అమిర్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. మరొకవైపు ఐసీసీ టోర్నీల్లో పాక్ పై తిరుగులేని రికార్డు ఉండటం కూడా భారత్ కు కలిసొచ్చే అంశం. ఐసీసీ టోర్నీల్లో భారత్ 13 మ్యాచ్ ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే గెలుపొందింది. దాంతో భారత్ జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరొకవైపు సంచలన పాకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ టోర్నీ లో పాకిస్తాన్ ఫైనల్ కు చేరే క్రమంలో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించి తుది పోరులో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు తప్పదు. మరొకొద్ది గంటల్లో తేలిపోనున్న ఫైనల్ ఫలితంలో చాంపియన్స్ ఎవరు అనే దాని కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఐదుసార్లు ఛేజింగ్ జట్లే..
ఈ టోర్నీ ఆరంభమైన దగ్గర్నుంచీ చూస్తే ఫైనల్ పోరులో ఛేజింగ్ చేసిన జట్టుకే మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఆరు ఫైనల్లో ఐదుసార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజేతగానిలిచింది. ఒకసారి మాత్రమే మొదటి బ్యాటింగ్ చేసిన జట్టును కప్ వరించింది. అది కూడా 2013 లో భారత్ జట్టు కావడం ఇక్కడ విశేషం. గత చాంపియన్ప్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కప్ ను దక్కించుకుంది.
పాకిస్తాన్ తుదిజట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), అజహర్ అలీ, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, మొహ్మద్ అమిర్, షాదబ్ ఖాన్, హసన్ అలీ, జునైద్ ఖాన్
భారత్ తుదిజట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్