సూర్య, శ్రేయస్‌, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు! | MCA Mandates Suryakumar Yadav And Shreyas Iyer to Participate In Mumbai T20 League, Says Report | Sakshi
Sakshi News home page

MCA: సూర్య, శ్రేయస్‌, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!

Published Thu, Apr 17 2025 2:36 PM | Last Updated on Thu, Apr 17 2025 3:45 PM

MCA Mandates Suryakumar Shreyas Iyer to Participate In Mumbai T20 League: Report

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఆవిర్భావం తర్వాత దేశంలో ఎన్నో స్థానిక టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (TPL), ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (APL), కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌, పంజాబ్‌ ప్రీమియర్‌ లీగ్‌, వెస్ట్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ ఇందులో భాగం.

ఇక ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) కూడా గత రెండు సీజన్లుగా  టీ20 ముంబై లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మే 26- జూన్‌ 5 వరకు మూడో ఎడిషన్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. అయితే, ఈ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ఎంసీఏ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి టీమిండియా స్టార్లందరినీ రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.

సూర్య, శ్రేయస్‌, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!
టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) సహా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, అజింక్య రహానే, శివం దూబే, పృథ్వీ షా, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులకు టీ20 ముంబై లీగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా ఎంసీఏ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కాగా ఐపీఎల్‌-2025 ముగిసిన తర్వాత టీమిండియా టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ టూర్‌కి ఎంపిక కాని ముంబై సభ్యులంతా స్థానిక టీ20 లీగ్‌లో పాల్గొనాలని ఎంసీఏ వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.

అదనంగా రూ. 15 లక్షలు 
ఈ విషయం గురించి ఎంసీఏ అధికారి ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ముంబైకి ఆడే టీమిండియా ఆటగాళ్లందరూ ముంబై టీ20 లీగ్‌లో ఆడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే ఈ లీగ్‌ మొదలవుతుంది. కాబట్టి.. టీమిండియా తరఫున విధుల్లో లేని వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలి.

ఒకవేళ గాయాల బెడదతో బాధపడుతూ ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ లీగ్‌లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు వేలం ఫీజుకు అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వాలని ఎంసీఏ నిర్ణయించింది. త్వరలోనే ఆటగాళ్ల కనీస ధరను నిర్ణయిస్తాం.

ఈ సీజన్‌లో ముంబై టీ20 లీగ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. 2800కి పైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముంబైకర్లకు క్రికెట్‌ అంటే ఎంత మక్కువో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

టీమిండియాకు భవిష్యత్‌ తారలను అందించేందుకు మేము చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది’’ అని సదరు ఎంసీఏ అధికారి పేర్కొన్నారు. కాగా.. వీలైతే రోహిత్‌ శర్మను కూడా రంగంలోకి దింపి ఈ లీగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే యోచనలో ఎంసీఏ ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: Rohit Sharma: కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement