సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్‌తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్‌స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.
172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర.
గత 5 ఇన్నింగ్స్‌ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..
142- రంజీ ట్రోఫీ
233- రంజీ ట్రోఫీ
47- రంజీ ట్రోఫీ
130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
Comments
Please login to add a commentAdd a comment