కేకేఆర్‌కు గుడ్‌ న్యూస్‌.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే | Good News To KKR, Rahane Hit 5 Half Centuries In The Last 6 SMAT Matches | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌కు గుడ్‌ న్యూస్‌.. అరివీర భయంకరమైన ఫామ్‌లో రహానే

Published Fri, Dec 13 2024 3:06 PM | Last Updated on Fri, Dec 13 2024 3:14 PM

Good News To KKR, Rahane Hit 5 Half Centuries In The Last 6 SMAT Matches

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. ఆ జట్టు వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీఫైనల్లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఈ టోర్నీలో రహానే గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

మహారాష్ట్రతో జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో రహానే పరుగుల ప్రవాహం మొదలైంది. ఆ మ్యాచ్‌లో అతను 34 బంతుల్లో 52 పరుగుల చేశాడు. ఆతర్వాత కేరళతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అనంతరం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

రహానే విశ్వరూపం ఆంధ్రతో జరిగిన చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌తో మొదలైంది. ఈ మ్యాచ్‌లో రహానే 53 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అనంతరం విదర్భతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తాజాగా బరోడాతో జరిగిన సెమీస్‌లో 57 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ప్రస్తుత సీజన్‌లో (సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ) రహానే లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో రహానే 8 మ్యాచ్‌లు ఆడి 172 స్ట్రయిక్‌ రేట్‌తో 366 పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన సెమీస్‌లో రహానే రఫ్ఫాడించడంతో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు చేరింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్‌ రావత్‌ (33), కృనాల్‌ పాండ్యా (30), శివాలిక్‌ శర్మ (26 నాటౌట్‌), అథీత్‌ సేథ్‌ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్‌ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్‌ అయ్యర్‌ (46) కూడా కాసేపు మెరుపు మెరిపించాడు. 

ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డిసెంబర్‌ 15న జరిగే అంతిమ పోరులో ముంబైతో తలపడనుంది. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో అజింక్య రహానేను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు రూ.1.5 కోట్ల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement