బీసీసీఐలో ముంబై ఓటు గల్లంతు
ఈశాన్య రాష్ట్రాలకు ఓటు హక్కు
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు కేంద్ర బిందువైన ముంబై ఇపుడు ప్రభ కోల్పోనుంది. బీసీసీఐలో శాశ్వత ఓటు హక్కును ముంబై సంఘం కోల్పోయింది. జస్టిస్ లోధా కమిటీ కీలక సిఫార్సు అయిన ‘ఒక రాష్ట్రం–ఒక ఓటు’ను అమలు చేసేందుకు బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సిద్ధమైంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు కొత్తగా బీసీసీఐ ఓటు పరిధిలోకి వచ్చాయి. మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఇప్పుడు బోర్డులో పూర్తిస్థాయి సభ్యత్వం లభించింది. దీంతో ఈ రాష్ట్రాలు బీసీసీఐలో క్రియాశీలం కానున్నాయి. తెలంగాణ (హెచ్‌సీఏ), ఉత్తరాఖండ్ సంఘాలు కూడా శాశ్వత సభ్యులుగా పూర్తిస్థాయి హోదా పొందాయి. సీఓఏ తాజాగా సభ్య సంఘాల మెమోరాండం (ఎంఓఏ) కొత్త నియమావళిని అమల్లోకి తెచ్చింది.
దీనికి సంబంధించిన నియమ నిబంధనలను అందులో పొందుపరిచింది. 41 సార్లు రంజీ చాంపియన్లను తయారు చేసిన ముంబై క్రికెట్ సంఘం ఇప్పుడు బీసీసీఐ అనుబంధ సభ్య సంఘంగా కొనసాగుతుంది. వీటితో పాటు బరోడా, సౌరాష్ట్ర సంఘాలు కూడా వారి మాతృ సంఘానికి జతగా... బీసీసీఐకి అనుబంధంగా కొనసాగుతాయి. ఇపుడీ సంఘాలు ప్రతి యేటా రొటేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకుంటాయి. అలాగే ఏ సంఘం కూడా మాకు మేమే జవాబుదారీలమనే వైఖరిని విడనాడాల్సిందేనని సీఓఏ స్పష్టం చేసింది. కాంట్రాక్టులు, నిర్మాణం, నిర్వహణ విషయాల్లో అవినీతి వటవృక్షాలవుతున్న ఢిల్లీ క్రికెట్ సంఘం, హైదరాబాద్ క్రికెట్ సంఘాలను ఉద్దేశించి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పారదర్శకంగా వ్యవహరించాల్సిందేనని చెప్పకనే చెప్పింది.