టెండూల్కర్ ‘ఫేర్‌వెల్’
సంతోషంగా ఉన్నాడు!
ముంబై: సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడనుండటం పట్ల సచిన్ టెండూల్కర్ సంతోషంగా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వెల్లడించింది. సచిన్ తరఫున ఎంసీఏ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘సొంత ప్రేక్షకుల మధ్య ముంబైలో ఆడటం పట్ల సచిన్ ఆనందంగా ఉన్నాడు. ఆఖరి టెస్టు సమయంలో తన తల్లి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తే చాలని అతను కోరుకుంటున్నాడు. ఎంసీఏ అతడిని ఏ రకంగా సన్మానించినా తనకు సమ్మతమే అని సచిన్ చెప్పాడు’ అని ప్రకటనలో ఎంసీఏ సంయుక్త కార్యదర్శి పీవీ శెట్టి వ్యాఖ్యానించారు. అయితే మాస్టర్ తరఫున అనూహ్యంగా ఎంసీఏ ప్రకటన జారీ చేయడం వెనుక ఆంతర్యం ఎవరకీ అంతుపట్టడం లేదు. మరో వైపు కాందివిలి మైదానానికి తన పేరు పెట్టడంతోపాటు, ఎంసీఏ పెయింటింగ్ బహుమతిగా ఇవ్వనుందని వస్తున్న వార్తలపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తొలి మ్యాచ్‌లో...
ఆఖరి మ్యాచ్‌లో...
ముంబై: సులక్షణ్ కులకర్ణి...ముంబై తదితర జట్ల తరఫున 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వికెట్ కీపర్. మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌తో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. సచిన్ తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ (1988లో) ఆడిన సమయంలో కులకర్ణి ముంబై (అప్పటి బాంబే) జట్టు సభ్యుడిగా మాస్టర్‌తో కలిసి ఆడాడు. ఇప్పుడు సచిన్ ఆఖరి రంజీ మ్యాచ్‌కు సులక్షణ్ ముంబై కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రస్తుతం ముంబై జట్టు ఆటగాళ్లు ఉద్విగ్నభరిత క్షణాలు ఎదుర్కొంటున్నారని సులక్షణ్ చెప్పారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చాలా ఉద్విగ్నంగా ఉంది. హర్యానాతో మ్యాచ్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సచిన్‌తో కలిసి ఉండటం యువ ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బందికి కూడా ఎంతో గొప్ప అవకాశం’ అని కులకర్ణి అన్నారు. ప్రస్తుత ముంబై జట్టులో వసీం జాఫర్, జహీర్ ఖాన్ మినహా అంతా కుర్రాళ్లే. ‘ఇది సచిన్ ఆఖరి మ్యాచ్ అని అందరికీ తెలుసు. అయితే అతని రిటైర్మెంట్ గురించి జట్టులో చర్చించే ధైర్యం ఎవరికీ లేదు. ఆట గురించి మాస్టర్ ఇచ్చే సూచనలు అమూల్యమైనవి. గతంలో ఎవరూ అలాంటి మాటలు చెప్పి ఉండకపోవచ్చు’ అని వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు.
పేస్ ప్రశంస
పుణే: అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కెరీర్‌ను కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ కొనియాడాడు. అలాగే మైదానం లోన వెలుపల అతడు ప్రవర్తించిన తీరు ప్రశంసనీయమన్నాడు. ‘నా దృష్టిలో ఇన్నాళ్ల కెరీర్‌లో సచిన్ తన ప్రవర్తనతో ఆకట్టుకున్న తీరు అమోఘం. 24 ఏళ్ల పాటు ఆడటం గొప్ప విషయం. ఈ విషయంలో మాస్టర్‌పై నాకు గౌరవముంది’ అని పేస్ అన్నాడు.