ఎంసీఏ వేదికగా రాజకీయ క్రీడ | 'Plan to contest MCA polls' | Sakshi
Sakshi News home page

ఎంసీఏ వేదికగా రాజకీయ క్రీడ

Published Sun, Sep 22 2013 11:46 PM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

'Plan to contest MCA polls'

సాక్షి, ముంబై:  ప్రజా సేవలో మునిగి తేలుతున్న రాజకీయ నాయకులు క్రికెట్ సేవలందించేందుకు పరితపిస్తున్నారు. రాజకీయ మైదానంపై రాణించిన రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు క్రికెట్ పిచ్‌పై కూడా బౌన్స్‌లు సంధిం చేందుకు సిద్ధమవుతున్నారు. అటు రాజకీయం...ఇటు క్రికెట్‌లో రాణించి అల్‌రౌండర్‌గా అందరి నోళ్లలో నానేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి ఆ పార్టీ...ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు క్రికెట్ సంఘాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళూరుతున్నారు.  అక్టోబరు 18న జరగబోయే ‘ముంబై క్రికెట్ అసోసియేషన్’ (ఎంసీఏ) ఎన్నికల్లో తమ అస్త్రాలను వదిలేందుకు రెడీ అవుతున్నారు.
 
 ఎన్నికల కోసం కసరత్తు
 ఎంసీఏ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జట్లు తలపడనున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్‌దేశాయ్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, శివసేన నేత సుభాష్ దేశాయి తదితర ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. అయితే గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. తటస్థవైఖరిని అవలంభించడంలో ముందుండే ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్‌దేశాయ్ కూడా ఎంసీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్ గత ఎన్నికల్లో ఎంసీఏ అధ్యక్షునిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు శరద్ పవార్ పూర్తి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అదేపద్ధతిలో  గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు పలికే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఈ సారి జరగబోయే పోటీలు రసవత్తరంగా మారనున్నాయని చెప్పవచ్చు.

 రాజకీయ నాయకుల ప్రాతినిథ్యం...
 మాజ్‌గావ్ క్లబ్‌కు పృథ్వీరాజ్ చవాన్, స్టాయిలో క్లబ్ కు గోపీనాథ్ ముండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు క్లబ్‌లకు యజమాని షా ఆలోమ్ శేఖ్ అనే ఒకే వ్యక్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాం గ్రెస్ కార్యకర్త అయిన శేఖ్ గతంలో విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌కు కూడా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మద్దతు పలికారు. ఇక దాదర్ పార్సీ జోరాష్ట్రీయన్ క్లబ్‌కు ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్‌దేశాయి, గోరేగావ్  ప్రబోధన్‌కు సుభాష్ దేశాయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
 
 శరద్ పవార్ పోటీలకు దూరం..?
 ఈసారి ఎంసీఏ పోటీలకు శరద్ పవార్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి.  శరద్ పవార్‌కు డీవై పాటిల్ అకాడమీ చీఫ్ విజయ్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ శరద్‌పవార్ స్వయంగా ఈసారి పోటీలో దిగే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలి సింది. ఆయన గోవా నుంచి బీసీసీఏ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనకు ఎంసీఏలో ఓటు హక్కు మాత్రం ఉండనుంది.
 
 1991 నుంచి రాజకీయ నాయకుల అరంగేట్రం..!
 ఎంసీఏ ఎన్నికల్లో అనేక మంది ఇప్పటివరకు రాజకీ య నాయకులు పదవులు చేపట్టారు. తొలిసారిగా 1991లో క్రికెట్ అభిమాని అయిన రాజకీయ నాయకుడు శేషారావ్ వాంఖడే ఎంసీఏకు అధ్యక్షునిగా ఎంపికయ్యారు. అనంతరం ఆయన పేరునే ముం బైలోని స్టేడియానికి పెట్టారు. ఇది జరిగిన అనంతరం 1992లో మాధవ్ మంత్రి, శివసేన నాయకుడు మనోహర్ జోషీల మధ్య ఎంసీఏ అధ్యక్ష పీఠం కోసం పోటీ జరిగింది. ఇందులో మనోహర్ జోషి విజయం సాధించారు. ఎంసీఏకు ఆయన ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షునిగా కొనసాగారు. 2000 నుంచి 2012 వరకు అధికారం శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. ఎంసీఏ అధ్యక్షుడిగా ఉంటూనే శరద్ పవార్ బీసీసీఐ, ఐసీసీ అధ్యక్ష పదవులు కూడా అలంకరించారు. 2012లో మాత్రం ముంబై ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో చివరి క్షణంలో తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన కింగ్‌మేకర్ పాత్రను పోషించారు. విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌కు ఆ పదవి దక్కడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
 
 ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు..
 ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో అనేక క్లబ్‌లకు రాజకీయ నాయకులే అధ్యక్షులు.  కొన్ని క్లబ్‌లనైతే కోట్లాది రూపాయలు వెచ్చించి కొందరు రాజకీయ నాయకులు కొనుగోలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, యువ సేన అధ్య క్షుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ నాయకులు ఆశీష్ శెలా ర్,  జితేంద్ర అవాడ్, శివసేన స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ శెవాలే క్లబ్‌లను కొనుగోలు చేసి ఎంసీఏ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement