pruthivi raj chauvan
-
సీఎంపై ఎన్సీపీ ఆగ్రహం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఎన్సీపీ మరోసారి విమర్శలు సంధించింది. పుణేలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చవాన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినా ప్రజల సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోలేపోతున్నాం. కాంగ్రెస్ కారణంగా నగరంలో అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి’ అని అజిత్ చ వాన్‌ను విమర్శించారు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా 23 గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదన పై ముఖ్యమంత్రి ఇంతవరకు సంతకం చేయలేదని దుయ్యబట్టారు. పుణేకి చెందిన అనేక సమస్యల ఫైళ్లు మంత్రాలయలో మగ్గుతున్నందున, వీటి పరిష్కారానికి కృషి చేయాలని అన్ని పార్టీల నాయకులు అజిత్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామాల విలీనంపై పలుమార్లు చర్చలు, సమావేశాలు జరిగినా నిర్ణయం మాత్రం తీసుకోలేదని అజిత్ వివరణ ఇచ్చారు. ‘శాసన,లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరవాత ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వస్తుంది. కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుపడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 23 గ్రామాలను విలీనంచేసే ప్రతిపాదనపై వెంటనే నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు. పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రానికి పంపించామని అజిత్ ఈ సందర్భంగా వెల్లడించారు. -
వచ్చే నెల నుంచి ఆహారభద్రత పథకం
ముంబై: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఇక్కడ ప్రకటించారు. రాష్ట్ర జనాభా 11 కోట్లలో దాదాపు ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలిగించే ఈ సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నవీముంబైలో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆహారభద్రత పథకం అమలు వల్ల నిరుపేదలకు కిలో జొన్నలు లేదా మొక్కజొన్నలను రూపాయికి, కిలో గోధుమలు రూ.రెండుకు, బియ్యం మూడు రూపాయలకే సరఫరా చేస్తారు. ఈ పథకాన్ని కేంద్రం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ఆరు కోట్ల మందికి వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం తన సొంత నిధులతో దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న మరో 1.77 కోట్ల మందిని సైతం లబ్ధిదారులుగా చేర్చింది. రాష్ట్రంలో 5.75 కోట్ల మంది ఏపీఎల్ జాబితాలో ఉండగా, వీరిలో వార్షికాదాయం రూ.44 వేల లోపు ఉన్న వారికి మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ.59 వేలు ఉన్నా పథకానికి అర్హులేనని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ 1.77 కోట్ల మంది కిలో బియ్యాన్ని రూ.9.60 చొప్పున, కిలో గోధుమలను రూ.7.20 చొప్పున సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఐదు కేజీల చొప్పున గోధుమలు, బియ్యం, జొన్నలు, మొక్కజొన్నలు పంపిణీ చేస్తారు. -
సింగపూర్‌ను స్టడీ చెయ్యండి
సాక్షి, ముంబై: నగర రోడ్లపై నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే వాహనాల రిజిస్ట్రేషన్‌లో పరిమితి విధించే అంశా న్ని అధ్యయనం చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అంతర్జాతీయ నగరమైన సింగపూర్‌లో ఎలా చర్యలు తీసుకుంటున్నారో పరి శీలించాలని కోరారు. అక్కడి ప్రభుత్వం వాహనాల నమోదు సంఖ్యను పరిమితం చేయడంతో అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం లేదన్నారు. వారు ఎప్పటికప్పుడు పాత కార్లను తొల గించి కొత్త కార్లను ఉపయోగిస్తూ ఉంటారని చవాన్ పేర్కొన్నారు. ఐదు ప్రమాదాల కన్నా ఎక్కువ ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు తిరిగి విధులు అప్పగించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ, బెస్ట్ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇదిలావుండగా నిత్యం నగర రోడ్లపై దాదాపు 20 లక్షల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇందులో 35 శాతం వాహనాలు ఆరేళ్లకు పైబడినవే ఉన్నాయి. ద్విచక్రవాహనాలు 43 శాతం, కార్లు 34 శాతానికి పెరిగాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమ స్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు, పొడవు కూడా వాహనాలకు తగ్గట్లుగా పెంచకపోవడం కూడా ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుంది. ధర తగ్గడం, నగరవాసుల ఆదాయం పెరగడం కూడా వాహనాల సంఖ్య పెరగడానికి మరో కారణమని అధికారులు భావిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలపడం ద్వారా ఎదురవుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నామని ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో రోడ్లకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేసి ఉంచడంతో పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు కూడా కరువయ్యాయన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు రోడ్డు ప్రమాదం సంభవిస్తోందని, జాగ్రత్తపరమైన చర్యలు చేపట్టకపోతే 2020లో ప్రతి మూడు నిమిషాలకు ఆరు రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే అవకాశం ఉంద ని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే అంధేరీ ఆర్టీవోలో డమ్మీ వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నామని తెలి పారు. ఇదిలావుండగా ప్రమాదాలు జరగడానికి ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్టీసీ తక్కువ నాణ్యత గల బస్సులను నడుపుతోందని, ఈ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని హోంశాఖ మంత్రి పాటిల్ తెలిపారు. -
ఇళ్ల ధరలకు కళ్లెం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బిల్డర్ల పట్ల కఠినంగా వ్యవహరిం చడం సామాన్యుడికి కొంతమేర మేలుచేసినట్టయింది. సీఎంగా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. 2012తో పోలిస్తే 2013లో ఇళ్ల ధరలు మూడు శాతం మేర పెరిగాయి. అయితే చవాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పరిశీలిస్తే ప్రస్తుతం ఐదు నుంచి తొమ్మిది శాతం ఇళ్ల ధరలు తగ్గినట్లు తేలింది. ఇందుకు కారణం బిల్డర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ నియమనిబంధనల ప్రకా రం నడుచుకోవాలంటూ సీఎం ఆదేశించడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. నగరంలోని వర్లి, పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాలు, ఠాణే, పన్వేల్ పరిసరాల్లో ఇళ్ల ధరలకు కళ్లెం పడింది. ‘నైంటినైన్ ఏకర్స్ డాట్ కామ్’ అనే సంస్థ రియల్ ఎస్టేట్ రంగంపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. చవాన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్మాణరంగానికి సంబంధించి పలు ఆంక్ష లు విధించారు. నియమనిబంధనల్లో పలు మార్పులు కూడా చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు బిల్డర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
అంబేద్కర్‌కు ఘననివాళి
సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ రూపకర్త, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దాదర్, శివాజీపార్కు పరిసరాలు శుక్రవారం జనసంద్రమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచితరలివచ్చిన లక్షలాది అంబేద్కర్ అభిమానులు ైచె త్యభూమిని సందర్శించారు. గంటల తరబడి ఎంతో ఓపికగా క్యూలో నిలబడి తమ ఆరాధ్యదైవానికి ఘన నివాళులర్పించారు. అభిమానులతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా ఉదయమే చైత్యభూమికి వచ్చి ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే, బీజేపీ నాయకులు గోపీనాథ్ ముండే, దేవేంద్ర ఫడణవిస్, వినోద్ తావ్డే, ఆనంద్‌రాజ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు చైత్యభూమిని సందర్శించి నివాళులర్పించారు. కాగా అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులపై ముంబై జిల్లా ఇంచార్జి మంత్రి జయంత్ పాటిల్, గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ లు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. కాగా తెల్లవారు జామునే చైత్యభూమిని దర్శించుకోవాలనే తపనతో అనేకమంది ముందురోజు సాయంత్రం నుంచే క్యూలో నిలబడ్డారు. ఇటు సిద్ధివినాయక్ మందిరం నుంచి సెంచురీ బజార్‌తోపాటు అటు మాహీందాకా ఇరువైపులా భారీ క్యూలు కనిపించాయి. ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులకుతోడుగా వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు సేవలందించారు. దాదర్ స్టేషన్లో రైలు దిగి వచ్చే జనానికి మార్గదర్శనం చేసేందుకు అక్కడక్కడా స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించారు. దాదర్, శివాజీపార్కు పరిసరాల్లో ట్రాఫిక్ అంక్షలు అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా దాదర్ నుంచి శివాజీపార్కు దిశగా వచ్చే ప్రధాన రహదారులు మొదలుకుని చిన్న రహదారులదాకా వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించారు. కొన్ని రోడ్లను వన్ వే గా, మరికొన్నింటిని పూర్తిగా నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. శివాజీపార్కు మీదుగా ప్రభాదేవి నుంచి మాహిం దిశగా వెళ్లే రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించేందుకు వందలాది ట్రాఫిక్ శాఖ పోలీసులను నియమించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో చైత్యభూమి పరిసరాలు కిటకిటలాడాయి. జై భీం నామస్మరణతో మార్మోగిపోయాయి. దీవాలో ఉద్రిక్తత అంబేద్కర్ చిత్రపటం ఉన్న పోస్టర్లు తొలగించినందుకు దీవా రైల్వే స్టేషన్లో గంటన్నర సేపు రైలురోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఆకస్మాత్తుగా చేపట్టిన ఈ రైలు రోకోవల్ల పిల్ల్లాపాపలతో బయటపడిన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. కొందరు అంబేద్కర్ అభిమానులు రైలు పట్టాలకు సమీపంలోనే బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగే ఆస్కారముందని రైలు నడిపే మోటర్మెన్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబేద్కర్ వాదులు రైలురోకోకు దిగారు. నచ్చజెప్పినప్పటికీ ఆందోళనకారులు తప్పుకోలేదు. దీంతో కొందరిని అదుపులోకి తీసుకుని మిగతావారిని నెట్టేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సహనం అవసరం: మంత్రి సచిన్ అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని నిర్మించడమనేది భారీ ప్రక్రియ అని. అందువల్ల తొందరపడితే లాభం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ పేర్కొన్నారు. చైత్యభూమిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభమవుతాయన్నారు. ప్రత్యేక రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నగరానికి లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు తిరిగి తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను నడుపుతోంది. నాగపూర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భణి, నాందేడ్, భుసావల్, చాలిస్గావ్, విదర్భ, మరఠ్వాడా తదితర ప్రాంతాలకు శుక్ర, శని, ఆదివారాలు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సీఎస్టీ నుంచి సేవాగ్రాం, దాదర్ నుంచి నాగపూర్, లోక్మాన్య తిలక్ టెర్మినస్ నుంచి అజనీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. -
సంక్షేమమే మా విధానం
నాగపూర్: సామాన్యుడి సంక్షేమానికి యూపీఏ ప్రభుత్వ విధానమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. అత్యల్ప ఆదాయ కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే రాష్ట్ర ప్రభుత్వ పథకం రాజీవ్ గాంధీ జీవన్ధాయి ఆరోగ్య యోజనను ఆమె గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆమ్ ఆద్మీకి మెరుగైన ఆరోగ్య సేవలను కల్పించేందుకు యూపీఏ కట్టుబడి ఉందన్నారు. గతేడాది ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని సర్కార్ మిగిలిన 27 జిల్లాలకు విస్తరించడాన్ని ప్రశంసించారు. ఈ పథకం కింద 971 ఆరోగ్య సంబంధ సమస్యలను, 121 ఫాలోఆప్ కేసులకు రూ.1.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని వివరించారు. ఈ పథకం కింద సర్జరీ, మందులతో పాటు ఉచిత చికిత్స ఉండటమే కాకుండా ఆస్పత్రుల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే తిరుగు ప్రయాణ చార్జీలను కూడా రోగులకు చెల్లిస్తారన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మహిళల ఆరోగ్యంపై జాతీయ సలహా మండలి చైర్పర్సన్ కూడా అయిన సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉండటం కూడా ఇందుకు కారణమన్నారు. ఈ పథకం కింద 2.11 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ఆ తర్వాత వేదికపై 78 మంది లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి పాల్గొన్నారు. -
చవాన్ వల్లే ఎన్సీపీ పుంజుకుంది
సాక్షి, ముంబై: ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పుణ్యమా అని రాష్ట్రంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బలం పెరిగిందని ఆ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 ఏళ్లలో పనిచేసిన సీఎంలు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, అశోక్ చవాన్లతో పొల్చుకుంటే పృథ్వీరాజ్ చవాన్‌కు అత్తెసరు మార్కులే వస్తాయని ఎన్సీపీ భవన్లో గురువారం మీడియాకు తెలిపారు. ఏడాది జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్సీపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుందని, ఈ ఫలితాలే ఎవరి బలం ఎంతా అన్నది తెలియజేస్తుందని అన్నారు. కాంగ్రెస్ వల్లే ఎన్సీపీకి పుంజుకుందన్న ఆ పార్టీ నాయకుల మాటలను కొట్టిపారేశారు. ‘14 ఏళ్ల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పిస్తున్నారు. భవిష్యత్‌లో కూడా కల్పిస్తారు. ప్రజలకు మా మీదున్న నమ్మకంతో మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎన్సీపీ బలం పెరగాలంటే మళ్లీ చవాన్నే ముఖ్యమంత్రి చేస్తామ’ని మాలిక్ వ్యంగంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించిన ప్రముఖుల పురస్కారాలను తిరిగి తీసుకోవాలని (లతా మంగేష్కర్ పేరు ఉచ్చరించకుండా) ఇటీవల ముంబై రీజియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్థన్ చందూర్కర్ చేసిన వ్యాఖ్యలపై మాలిక్ స్పందించారు. అయన వైఖరి తమకి ఆమోదయోగ్యం కాదన్నారు. మిత్రపక్షమైనా ఇలా ఒకరి మనసు బాధపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. -
ఢిల్లీపైనే ఎన్సీపీ, కాంగ్రెస్ గురి లోక్‌సభ సీట్లపై లొల్లి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో మరోసారి గద్దెనెక్కడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు వ్యూహప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ సీట్లను సాధించుకునేందుకు సీనియర్ మంత్రులను రాబోయే లోక్‌సభ ఎన్నికలబరిలో దింపాలని యోచిస్తున్నాయి. అయితే సీనియర్లు మాత్రం లోక్‌సభకు వెళ్లడానికి సుతరామూ ఇష్టపడడం లేదు. రాహుల్‌ను ప్రధాని చేయడానికి వీలుగా అత్యధిక స్థానాలకు కైవసం చేసుకుని మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్వీళ్లూరుతోంది. ఈ విషయంపై ఇప్పటికే అధిష్టానంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చర్చలు కూడా జరిపారు. ఇక రాష్ట్రంలో బలాబలాను పరిశీలించినట్టయితే గత ఎన్నికల్లో 26 స్థానాల్లో పోటీ చే సిన కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. విజయం సాధించిన స్థానాలతోపాటు పరాజయం పాలైన లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ సర్వే జరుపుతోంది. అధిక స్థానాలు గెలుచుకునేందుకు సీనియర్ మంత్రులను బరిలోకి దింపితే బాగుంటుందని ముఖ్యమంత్రితోపాటు అధిష్టానమూ భావిస్తోంది. ఎన్సీపీ గురి కూడా ఢిల్లీపైనే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుకు ఎన్సీపీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఎన్సీపీకి మహారాష్ట్రలోనే అత్యధిక పట్టుంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ కూడా అత్యధిక స్థానాలు కైవ సం చేసుకునేందుకు కాంగ్రెస్ మాదిరిగానే సీనియర్ నాయకులు, మంత్రులను లోక్‌సభ బరిలోకి దింపాలని భావిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కూడా సీనియర్ మంత్రులను లోక్‌సభకు పంపిస్తామని ప్రకటించారు. తమకు అత్యధికంగా పట్టున్న మహారాష్ట్రలో కనీసం 15 లోకసభ స్థానాలను సాధించుకోవాలని ఎన్సీపీ పట్టుదలతో ఉంది. రాష్ట్ర రాజకీయాలవైపే సీనియర్ల మొగ్గు.. కాంగ్రెస్, ఎన్సీపీ తమ సీనియర్ నాయకులు, మంత్రులను లోక్‌సభ బరిలోకి దింపాలని యోచిస్తుండగా, వాళ్లంతా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అధిష్టానాన్ని ఎదిరించే ధైర్యం చేయడం లేదు. నాగపూర్ ఎంపీ, బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి గట్టి పోటీ ఇచ్చేందుకుగా ఆర్థిక , జలవనరుల సహాయక మంత్రి రాజేంద్ర ములూక్ను బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గడ్కరీకి ప్రస్తుత ఎంపీ విలాస్ ముత్తెంవార్ కంటే రాజేంద్ర ములూక్ గట్టిపోటీ ఇవ్వగలడని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. ములూక్ మాత్రం లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇష్టపడడంలేదు. మాకొద్దు లోక్‌సభ సీట్లు.. చంద్రపూర్ లోక్‌సభస్థానం నుంచి పర్యావరణ, సాంస్కృతిక శాఖ మంత్రి సంజయ్ దేవతలేను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన ఉంది. మాజీ ఎంపీ నరేష్ పుంగలియ ఇక్కడ వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా దేవతలేను తెరపైకి తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దేవతలేకు మాత్రం లోక్‌సభకు పోటీ చేయడం ఇష్టంలేదు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని అయిష్టంగానే చెబుతున్నట్టు తెలిసింది. ఇక కొల్హాపూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో ఇక్కడి నుంచి హోంశాఖ సహాయమంత్రి సతేజ్ ఎలియాస్ బంటి పాటిల్‌ను బరిలోకి దింపే అవకాశముంది. ఆయన కూడా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావాలని, లోక్‌సభకు వెళ్లకూడదని అనుకుంటున్నారు. ఎన్సీపీలోనూ ఇదే పరిస్థితి... కేంద్రంలో పార్టీని బలోపితం చేసేందుకు సీనియర్ నాయకులు, మంత్రులను బరిలోకి దింపాలని ఎన్సీపీ కూడా యోచిస్తోంది. కాంగ్రెస్ మంత్రుల మాదిరిగానే ఎన్సీపీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా లోక్‌సభకు పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు, ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌ను నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తోంది. భుజ్‌బల్ పేరు దాదాపు ఖాయమేనని భావిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం ముంబైలోనే ఉండాలని కోరుకుంటున్నారు. హత్కణంగలే నుంచి గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జయంత్ పాటిల్, మావల్ నియోజకవర్గం నుంచి సునీల్ తట్కరేను బరిలోకి దింపనున్నట్టు ఎన్సీపీ నుంచి సంకేతాలు వచ్చాయి. అయితే హతకణంగలే లోక్‌సభ నుంచి పోటీని తప్పించుకునేందుకు జయంత్ పాటిల్ ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోటాలోకి నెట్టేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అంటే ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. తాజా విస్తరణలో కొందరు యువనాయకులకు అవకాశం కల్పించినా, వీరిలోనూ పలువురిని లోక్‌సభకు పోటీ చేయించాలని ఎన్సీపీ అనుకుంటోంది. నీటివనరుల శాఖ (కృష్ణవ్యాలీ) మంత్రి రామ్రాజ్ నింబాల్కర్, రెవెన్యూ శాఖ సహాయక మంత్రి ప్రకాశ్ సోలంకేను మంత్రి మండలి నుంచి తప్పించినప్పటికీ వారిని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. నింబాల్కర్‌ను షోలాపూర్ జిల్లా మాఢా లోక్‌సభ నియోజకవర్గం నుంచి, సోలంకేను బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశముంది. మాఢా స్థానం నుంచి గతంలో స్వయానా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పోటీ చేసి గెలిచారు. మరోవైపు బీడ్ ఎంపీగా బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే వ్యవహరిస్తున్నారు. బీడ్ నుంచి ప్రకాశ్ సోలంకే ముండేకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు సతారా ఎంపీ ఉదయ్‌రాజ్ భోస్లే శివసేన, బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే భోస్లేకు పోటీగా సతారా ఎమ్మెల్యే, ఎన్సీపీ యువనాయకుడు శశికాంత్ షిండేను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపడానికి ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. షిండే స్థానికంగా మరింత పట్టు పెంచుకొని బలోపేతం కావడానికి మంత్రి మండలిలో స్థానం కల్పించారని చెప్పవచ్చు. పార్టీ అధిష్టానం కేంద్రంలో అధికారాన్ని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతుండగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు మాత్రం తమ రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు. -
లెండిపై కన్నేసిన ‘మహా’ సర్కారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మంజీరా నదిపై లెండి ప్రాజెక్టు ఎగువ భాగం లో మరో మూడు ఎత్తిపోతల పథకాలను చేపట్టేందు కు మహా సర్కారు కుట్ర పన్నుతోంది. కేంద్ర జలవనరుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం బాబ్లీ గేట్ల మూసివేత సందర్భంగా వారు మా ట్లాడిన తీరు చూస్తుంటే జిల్లాకు తాగు, సాగునీటి గండం తప్పదనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అక్టోబర్ 28 నుంచి జూన్ 30 వరకు బాబ్లీ గేట్లను మూసివేసే అవకాశం ఉంది. ఎనిమిది నెలలు బాబ్లీ గేట్లు మూసి ఉంచడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని 60 టీఎంసీల నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉం టుంది. గేట్లను తెరిచిన కూడా సాగర్‌లోని ఈ నీరు బాబ్లీలోకి వెళుతుందని పేర్కొంటున్నారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు తీవ్ర నష్టం వాటిల్లినుంది. బాబ్లీ గేట్ల మూసి వేత సందర్భంగా మ హారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పేర్కొన్న తీరును పరిశీలిస్తే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండిని బాబ్లీలాగానే దక్కించుకునేందుకు కుట్రపన్నుతున్నట్లు తెలుస్తుం ది. ఇదే జరిగితే జుక్కల్ నియోజకవర్గంలోని 22,700 ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.మహారాష్ట్ర,ఆంధ్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తున్న మంజీరానదిపై లెండి ప్రాజెక్టు ఎగు వ భాగంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలను ని ర్మించేందుకు మహారాష్ట్ర కుట్ర చేస్తోంది. -
కోలుకునేదెన్నడో?
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని వస్త్ర పరిశ్రమలు పలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వ్యాపారం ఆశించిన రీతిలో జరగకపోవడం, విద్యు త్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఇది ఈ రంగంలో ఉన్నవారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ, దసరా, బక్రీద్, దీపావళి తదితర పండుగల సమయంలో పట్టణంలోని దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడతాయి. అయితే ఈ ఏడా ది వాటి వద్ద సందండి అంతంతగానే ఉంది. వస్త్ర తయారీకి ఉపయోగపడే నూలు ధరల హెచ్చుతగ్గుల వల్ల వ్యాపారులకు నష్టం వాటిల్లుతోది. పట్టణవ్యాప్తంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. మరోవైపు గత నెల నుంచి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసి టీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు విద్యుత్ చార్జీలను పెంచిం ది. దీంతో ఏమిచేయాలో పాలుపోని రాష్ట్రం లోని పలు పవర్లూమ్ సంఘాలు ఈ నెల ఐదో తేదీన బోర్డు ప్రతినిధులను కలిశాయి. చార్జీలను పెంచొద్దంటూ విన్నవించాయి. అయినప్పటికీ వారి గోడు ను ఎవరూ ఆలకించలేదు. దీంతో జౌళి శాఖ మాజీ మంత్రి ప్రకాశ్ అవాడే నేతృత్వంలో భివండీ, ఇచల్కరంజీ, షోలాపూర్, సాంగ్లీ పట్టణాలకు చెందిన పవర్లూమ్ అసోసియేషన్లకు చెందిన ప్రతిని ధులు వంగ పురుషోత్తం, సతీశ్ కోస్టి, పెంటప్ప గడ్డం, కొంక మల్లేశం, రాజురాఠి, రాజు పాటిల్ తది తరులు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లను కలసి విద్యుత్ చార్జీల పెంపువల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన సీఎం... ఈ అంశాన్ని మంత్రిమండలి సమావేశంలో చర్చించి చార్జీలు తగ్గేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఏడున సమావేశం విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ గ్రాహక్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తేదీన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు స్థానిక మీనాతాయి ఠాక్రే హాలులో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశంలో భివండీ పవర్లూమ్ ఓనర్స్ అండ్ వీవర్స్ అసోసియేషన్, భివండీ పద్మనగర్ పవర్లూమ్ అసోసియేషన్, శాంతినగర్ పవర్లూమ్ అసోసియేషన్, అల్హారి పవర్లూమ్ అసోసి యేషన్, నాలాపార్ పవర్లూమ్ అసోసియేషన్, కాడిపార్ పవర్లూమ్ అసోసియేషన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. టోరెంట్ విద్యుత్ వాత పట్టణానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న టోరంట్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఈ నెల ఏడో తేదీ నుంచి చార్జీలను పెంచనుంది. ఇదిలాఉండగా నెల క్రితం వినియోగించిన విద్యుత్‌కు కూడా పెంచిన చార్జీల ను కలిపి బిల్లులు ఇచ్చారని భివండీ పవర్లూమ్ ఓనర్స్ అండ్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డపెల్లి లక్ష్మణ్, కార్యదర్శి సిరిపురం తిరుపతి, పోతు గంగాధర్, బొల్ల వీరేందర్, మ్యాకల్ అశోక్, గాలి శ్రీనివాస్ తదితర వ్యాపారులు ఆరోపించారు. -
‘నవీముంబై’ ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్టే. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దేశరాజధానిలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లను ఆహ్వానించే అవకాశముంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంతో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉండిపోయింది. అయితే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చవాన్ తాజాగా జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవీముంబైలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఉప్పు భూముల వివాదం, అటవీ , పర్యావరణ శాఖ అభ్యంతరాలు, స్థానిక ప్రజలు, రైతుల ఆందోళనలు, రాజకీయ నాయకులు జోక్యం తదితర వివాదాల మధ్య చిక్కుకున్న సంగతి విదితమే. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడది దాదాపు రూ 20 వేల కోట్లకు చేరుకుంది. 2015లో ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఎంసీఏ వేదికగా రాజకీయ క్రీడ
సాక్షి, ముంబై: ప్రజా సేవలో మునిగి తేలుతున్న రాజకీయ నాయకులు క్రికెట్ సేవలందించేందుకు పరితపిస్తున్నారు. రాజకీయ మైదానంపై రాణించిన రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు క్రికెట్ పిచ్‌పై కూడా బౌన్స్‌లు సంధిం చేందుకు సిద్ధమవుతున్నారు. అటు రాజకీయం...ఇటు క్రికెట్లో రాణించి అల్‌రౌండర్‌గా అందరి నోళ్లలో నానేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి ఆ పార్టీ...ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులు క్రికెట్ సంఘాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళూరుతున్నారు. అక్టోబరు 18న జరగబోయే ‘ముంబై క్రికెట్ అసోసియేషన్’ (ఎంసీఏ) ఎన్నికల్లో తమ అస్త్రాలను వదిలేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోసం కసరత్తు ఎంసీఏ ఎన్నికల్లో రాజకీయ నాయకుల జట్లు తలపడనున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, శివసేన నేత సుభాష్ దేశాయి తదితర ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. అయితే గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. తటస్థవైఖరిని అవలంభించడంలో ముందుండే ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయ్ కూడా ఎంసీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్ గత ఎన్నికల్లో ఎంసీఏ అధ్యక్షునిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు శరద్ పవార్ పూర్తి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అదేపద్ధతిలో గోపీనాథ్ ముండేకు పృథ్వీరాజ్ చవాన్ మద్దతు పలికే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఈ సారి జరగబోయే పోటీలు రసవత్తరంగా మారనున్నాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల ప్రాతినిథ్యం... మాజ్‌గావ్ క్లబ్‌కు పృథ్వీరాజ్ చవాన్, స్టాయిలో క్లబ్ కు గోపీనాథ్ ముండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు క్లబ్‌లకు యజమాని షా ఆలోమ్ శేఖ్ అనే ఒకే వ్యక్తి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాం గ్రెస్ కార్యకర్త అయిన శేఖ్ గతంలో విలాస్రావ్దేశ్ముఖ్కు కూడా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మద్దతు పలికారు. ఇక దాదర్ పార్సీ జోరాష్ట్రీయన్ క్లబ్‌కు ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్దేశాయి, గోరేగావ్ ప్రబోధన్‌కు సుభాష్ దేశాయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శరద్ పవార్ పోటీలకు దూరం..? ఈసారి ఎంసీఏ పోటీలకు శరద్ పవార్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. శరద్ పవార్‌కు డీవై పాటిల్ అకాడమీ చీఫ్ విజయ్ పాటిల్ మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ శరద్‌పవార్ స్వయంగా ఈసారి పోటీలో దిగే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలి సింది. ఆయన గోవా నుంచి బీసీసీఏ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనకు ఎంసీఏలో ఓటు హక్కు మాత్రం ఉండనుంది. 1991 నుంచి రాజకీయ నాయకుల అరంగేట్రం..! ఎంసీఏ ఎన్నికల్లో అనేక మంది ఇప్పటివరకు రాజకీ య నాయకులు పదవులు చేపట్టారు. తొలిసారిగా 1991లో క్రికెట్ అభిమాని అయిన రాజకీయ నాయకుడు శేషారావ్ వాంఖడే ఎంసీఏకు అధ్యక్షునిగా ఎంపికయ్యారు. అనంతరం ఆయన పేరునే ముం బైలోని స్టేడియానికి పెట్టారు. ఇది జరిగిన అనంతరం 1992లో మాధవ్ మంత్రి, శివసేన నాయకుడు మనోహర్ జోషీల మధ్య ఎంసీఏ అధ్యక్ష పీఠం కోసం పోటీ జరిగింది. ఇందులో మనోహర్ జోషి విజయం సాధించారు. ఎంసీఏకు ఆయన ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షునిగా కొనసాగారు. 2000 నుంచి 2012 వరకు అధికారం శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. ఎంసీఏ అధ్యక్షుడిగా ఉంటూనే శరద్ పవార్ బీసీసీఐ, ఐసీసీ అధ్యక్ష పదవులు కూడా అలంకరించారు. 2012లో మాత్రం ముంబై ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో చివరి క్షణంలో తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన కింగ్‌మేకర్ పాత్రను పోషించారు. విలాస్రావ్దేశ్ముఖ్కు ఆ పదవి దక్కడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు.. ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో అనేక క్లబ్‌లకు రాజకీయ నాయకులే అధ్యక్షులు. కొన్ని క్లబ్లనైతే కోట్లాది రూపాయలు వెచ్చించి కొందరు రాజకీయ నాయకులు కొనుగోలు చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, యువ సేన అధ్య క్షుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ నాయకులు ఆశీష్ శెలా ర్, జితేంద్ర అవాడ్, శివసేన స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ శెవాలే క్లబ్‌లను కొనుగోలు చేసి ఎంసీఏ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. -
‘నిర్భయ’ కేసు తీర్పుపై హర్షం
ముంబై : ‘నిర్భయ’ కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ స్వాగతించారు. గత ఏడాది డిసెంబర్ 16న కదులుతున్న బస్సుల్లో ఒక మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడైన మైనర్‌కు బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన నలుగురు నిందితులపై కేసును విచారించిన ఢిల్లీ కోర్టు శుక్రవారం ఉరిశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ తీర్పు తర్వాత ఇటువంటి నేరాలకు పాల్పడటానికి ఎవరైనా భయపడతారు..’ అని అన్నారు. ఈ తీర్పు బాధితురాలి కుటుంబానికి ఓదార్పు నిస్తుందని భావిస్తున్నానన్నారు. ఈకేసు విచారణ నేరం జరిగిన 9 నెలల్లోనే ముగియడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగడం అవసరం. మహారాష్ట్రలో కూడా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చవాన్ తెలిపారు. ‘ఢిల్లీ కోర్టు తీర్పు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్లయ్యింది.ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానాలు కూడా సమర్ధిస్తాయని ఆశిస్తున్నాను..’ అంటూ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వ్యాఖ్యానించారు. న్యాయవిచారణ చాలా త్వరగానే ముగిసింది.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షను అమలుచేయాల్సిన అవసరం ఉంది..అప్పుడే సమాజంలో ఇటువంటి నేరాలు చేయడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారు..’ అని అన్నారు. ఈ సందర్భంగా గతనెలలో ముంబైలోని శక్తి మిల్స్‌లో విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై ముఖ్యమంత్రి చవాన్, హోంమంత్రి పాటిల్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుగుతుందని వివరించారు