ముంబై : ‘నిర్భయ’ కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ స్వాగతించారు. గత ఏడాది డిసెంబర్ 16న కదులుతున్న బస్సుల్లో ఒక మహిళపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడైన మైనర్‌కు బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన నలుగురు నిందితులపై కేసును విచారించిన ఢిల్లీ కోర్టు శుక్రవారం ఉరిశిక్షను ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ తీర్పు తర్వాత ఇటువంటి నేరాలకు పాల్పడటానికి ఎవరైనా భయపడతారు..’ అని అన్నారు. ఈ తీర్పు బాధితురాలి కుటుంబానికి ఓదార్పు నిస్తుందని భావిస్తున్నానన్నారు.
ఈకేసు విచారణ నేరం జరిగిన 9 నెలల్లోనే ముగియడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగడం అవసరం. మహారాష్ట్రలో కూడా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చవాన్ తెలిపారు. ‘ఢిల్లీ కోర్టు తీర్పు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్లయ్యింది.ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానాలు కూడా సమర్ధిస్తాయని ఆశిస్తున్నాను..’ అంటూ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ వ్యాఖ్యానించారు. న్యాయవిచారణ చాలా త్వరగానే ముగిసింది.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షను అమలుచేయాల్సిన అవసరం ఉంది..అప్పుడే సమాజంలో ఇటువంటి నేరాలు చేయడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారు..’ అని అన్నారు. ఈ సందర్భంగా గతనెలలో ముంబైలోని శక్తి మిల్స్‌లో విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై ముఖ్యమంత్రి చవాన్, హోంమంత్రి పాటిల్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుగుతుందని వివరించారు
‘నిర్భయ’ కేసు తీర్పుపై హర్షం
Published Sat, Sep 14 2013 12:34 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement