రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఇక్కడ ప్రకటించారు.
ముంబై: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సోమవారం ఇక్కడ ప్రకటించారు. రాష్ట్ర జనాభా 11 కోట్లలో దాదాపు ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలిగించే ఈ సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నవీముంబైలో లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఆహారభద్రత పథకం అమలు వల్ల నిరుపేదలకు కిలో జొన్నలు లేదా మొక్కజొన్నలను రూపాయికి, కిలో గోధుమలు రూ.రెండుకు, బియ్యం మూడు రూపాయలకే సరఫరా చేస్తారు. ఈ పథకాన్ని కేంద్రం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) ఆరు కోట్ల మందికి వర్తింప జేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం తన సొంత నిధులతో దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న మరో 1.77 కోట్ల మందిని సైతం లబ్ధిదారులుగా చేర్చింది. రాష్ట్రంలో 5.75 కోట్ల మంది ఏపీఎల్ జాబితాలో ఉండగా, వీరిలో వార్షికాదాయం రూ.44 వేల లోపు ఉన్న వారికి మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వార్షికాదాయం రూ.59 వేలు ఉన్నా పథకానికి అర్హులేనని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ 1.77 కోట్ల మంది కిలో బియ్యాన్ని రూ.9.60 చొప్పున, కిలో గోధుమలను రూ.7.20 చొప్పున సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఐదు కేజీల చొప్పున గోధుమలు, బియ్యం, జొన్నలు, మొక్కజొన్నలు పంపిణీ చేస్తారు.