సాక్షి, ముంబై: పేదల సౌకర్యార్థం కేంద్రం ప్రవేశపెట్టిన ఆహార భద్రత పథకం ఈ నెల 26న రాష్ట్రంలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆ రోజు ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత జిల్లా ఇన్‌చార్జి మంత్రులు అధికారికంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.23 కోట్ల జనాభాలో దాదాపు ఏడు కోట్ల ప్రజలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ ఆర్థిక ఆదాయాన్నిబట్టి దారిద్య్ర రేఖకు దిగువ, కేసరి (ఆరెంజ్) రంగు, అన్నపూర్ణ, తెలుపు రంగు ఇలా వర్గాలను బట్టి వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వీటికి బదులుగా ఇప్పుడు కేవలం దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ ఇలా రెండు వర్గాలుగా విభజించారు. కుటుంబ పెద్దగా పురుషుడికి బదులుగా మహిళ పేరును నమోదు చేస్తున్నారు. ఆమె ఫొటో, బార్‌కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డు త్వరలో అధికారులు పంపిణీ చేయనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు ప్రతినెలా 35 కేజీల ధాన్యం పంపిణీ చేయనున్నారు. ఇతరులకు రేషన్ కార్డుపై నమోదైన కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ధాన్యం పంపిణీ ఉంటుంది. గోధుమలు కేజీ రూ. రెండు, బియ్యం కేజీ రూ.మూడు, జొన్నలు, మొక్కజొన్నలు, ఇతర దినుసులు కేజీ రూపాయి చొప్పున లబ్ధిదారులకు అందుతాయని దేశ్‌ముఖ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున కేవలం పది మందిని ఎంపిక చేసి పథకాన్ని తాత్కాలికంగా ప్రారంభిస్తామని, ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు.
26న ఆహార భద్రత పథకం ప్రారంభం
Published Wed, Jan 8 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement