నాగపూర్: సామాన్యుడి సంక్షేమానికి యూపీఏ ప్రభుత్వ విధానమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. అత్యల్ప ఆదాయ కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే రాష్ట్ర ప్రభుత్వ పథకం రాజీవ్ గాంధీ జీవన్‌ధాయి ఆరోగ్య యోజనను ఆమె గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆమ్ ఆద్మీకి మెరుగైన ఆరోగ్య సేవలను కల్పించేందుకు యూపీఏ కట్టుబడి ఉందన్నారు. గతేడాది ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని సర్కార్ మిగిలిన 27 జిల్లాలకు విస్తరించడాన్ని ప్రశంసించారు.
ఈ పథకం కింద 971 ఆరోగ్య సంబంధ సమస్యలను, 121 ఫాలోఆప్ కేసులకు రూ.1.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుందని వివరించారు. ఈ పథకం కింద సర్జరీ, మందులతో పాటు ఉచిత చికిత్స ఉండటమే కాకుండా ఆస్పత్రుల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే తిరుగు ప్రయాణ చార్జీలను కూడా రోగులకు చెల్లిస్తారన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మహిళల ఆరోగ్యంపై జాతీయ సలహా మండలి చైర్‌పర్సన్ కూడా అయిన సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉండటం కూడా ఇందుకు కారణమన్నారు. ఈ పథకం కింద 2.11 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ఆ తర్వాత వేదికపై 78 మంది లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి పాల్గొన్నారు.
సంక్షేమమే మా విధానం
Published Fri, Nov 22 2013 6:41 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement