సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ రూపకర్త, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దాదర్, శివాజీపార్కు పరిసరాలు శుక్రవారం జనసంద్రమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచితరలివచ్చిన లక్షలాది అంబేద్కర్ అభిమానులు ైచె త్యభూమిని సందర్శించారు. గంటల తరబడి ఎంతో ఓపికగా క్యూలో నిలబడి తమ ఆరాధ్యదైవానికి ఘన నివాళులర్పించారు. అభిమానులతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా ఉదయమే చైత్యభూమికి వచ్చి ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్‌పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే, బీజేపీ నాయకులు గోపీనాథ్ ముండే, దేవేంద్ర ఫడణవిస్, వినోద్ తావ్డే, ఆనంద్‌రాజ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు చైత్యభూమిని సందర్శించి నివాళులర్పించారు. కాగా అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులపై ముంబై జిల్లా ఇంచార్జి మంత్రి జయంత్ పాటిల్, గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ లు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. కాగా తెల్లవారు జామునే చైత్యభూమిని దర్శించుకోవాలనే తపనతో అనేకమంది ముందురోజు సాయంత్రం నుంచే క్యూలో నిలబడ్డారు. ఇటు సిద్ధివినాయక్ మందిరం నుంచి సెంచురీ బజార్‌తోపాటు అటు మాహీందాకా ఇరువైపులా భారీ క్యూలు కనిపించాయి. ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులకుతోడుగా వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు సేవలందించారు. దాదర్ స్టేషన్‌లో రైలు దిగి వచ్చే జనానికి మార్గదర్శనం చేసేందుకు అక్కడక్కడా స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించారు.
దాదర్, శివాజీపార్కు పరిసరాల్లో ట్రాఫిక్ అంక్షలు
అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా దాదర్ నుంచి శివాజీపార్కు దిశగా వచ్చే ప్రధాన రహదారులు మొదలుకుని చిన్న రహదారులదాకా వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించారు. కొన్ని రోడ్లను వన్ వే గా, మరికొన్నింటిని పూర్తిగా నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. శివాజీపార్కు మీదుగా ప్రభాదేవి నుంచి మాహిం దిశగా వెళ్లే రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించేందుకు వందలాది ట్రాఫిక్ శాఖ పోలీసులను నియమించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో చైత్యభూమి పరిసరాలు కిటకిటలాడాయి. జై భీం నామస్మరణతో మార్మోగిపోయాయి.
దీవాలో ఉద్రిక్తత
అంబేద్కర్ చిత్రపటం ఉన్న పోస్టర్లు తొలగించినందుకు దీవా రైల్వే స్టేషన్‌లో గంటన్నర సేపు రైలురోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఆకస్మాత్తుగా చేపట్టిన ఈ రైలు రోకోవల్ల పిల్ల్లాపాపలతో బయటపడిన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. కొందరు అంబేద్కర్ అభిమానులు రైలు పట్టాలకు సమీపంలోనే బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగే ఆస్కారముందని రైలు నడిపే మోటర్‌మెన్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబేద్కర్ వాదులు రైలురోకోకు దిగారు. నచ్చజెప్పినప్పటికీ ఆందోళనకారులు తప్పుకోలేదు. దీంతో కొందరిని అదుపులోకి తీసుకుని మిగతావారిని నెట్టేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
సహనం అవసరం: మంత్రి సచిన్
అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని నిర్మించడమనేది భారీ ప్రక్రియ అని. అందువల్ల తొందరపడితే లాభం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ పేర్కొన్నారు. చైత్యభూమిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభమవుతాయన్నారు.
ప్రత్యేక రైళ్లు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నగరానికి లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు తిరిగి తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను నడుపుతోంది. నాగపూర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భణి, నాందేడ్, భుసావల్, చాలిస్‌గావ్, విదర్భ, మరఠ్వాడా తదితర ప్రాంతాలకు శుక్ర, శని, ఆదివారాలు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సీఎస్టీ నుంచి సేవాగ్రాం, దాదర్ నుంచి నాగపూర్, లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ నుంచి అజనీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అంబేద్కర్‌కు ఘననివాళి
Published Fri, Dec 6 2013 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement