సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఎన్సీపీ మరోసారి విమర్శలు సంధించింది. పుణేలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చవాన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినా ప్రజల సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోలేపోతున్నాం. కాంగ్రెస్ కారణంగా నగరంలో అనేక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి’ అని అజిత్ చ వాన్‌ను విమర్శించారు.
పుణే మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్తగా 23 గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదన పై ముఖ్యమంత్రి ఇంతవరకు సంతకం చేయలేదని దుయ్యబట్టారు. పుణేకి చెందిన అనేక సమస్యల ఫైళ్లు మంత్రాలయలో మగ్గుతున్నందున, వీటి పరిష్కారానికి కృషి చేయాలని అన్ని పార్టీల నాయకులు అజిత్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామాల విలీనంపై పలుమార్లు చర్చలు, సమావేశాలు జరిగినా నిర్ణయం మాత్రం తీసుకోలేదని అజిత్ వివరణ ఇచ్చారు. ‘శాసన,లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరవాత ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వస్తుంది. కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుపడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 23 గ్రామాలను విలీనంచేసే ప్రతిపాదనపై వెంటనే నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు. పుణేలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రానికి పంపించామని అజిత్ ఈ సందర్భంగా వెల్లడించారు.
సీఎంపై ఎన్సీపీ ఆగ్రహం
Published Mon, Jan 13 2014 11:22 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement