సాక్షి, ముంబై: ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పుణ్యమా అని రాష్ట్రంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) బలం పెరిగిందని ఆ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 ఏళ్లలో పనిచేసిన సీఎంలు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, అశోక్ చవాన్‌లతో పొల్చుకుంటే పృథ్వీరాజ్ చవాన్‌కు అత్తెసరు మార్కులే వస్తాయని ఎన్‌సీపీ భవన్‌లో గురువారం మీడియాకు తెలిపారు. ఏడాది జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్సీపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలే కైవసం చేసుకుందని, ఈ ఫలితాలే ఎవరి బలం ఎంతా అన్నది తెలియజేస్తుందని అన్నారు. కాంగ్రెస్ వల్లే ఎన్సీపీకి పుంజుకుందన్న ఆ పార్టీ నాయకుల మాటలను కొట్టిపారేశారు. ‘14 ఏళ్ల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పిస్తున్నారు.
భవిష్యత్‌లో కూడా కల్పిస్తారు. ప్రజలకు మా మీదున్న నమ్మకంతో మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎన్సీపీ బలం పెరగాలంటే మళ్లీ చవాన్‌నే ముఖ్యమంత్రి చేస్తామ’ని మాలిక్ వ్యంగంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించిన ప్రముఖుల పురస్కారాలను తిరిగి తీసుకోవాలని (లతా మంగేష్కర్ పేరు ఉచ్చరించకుండా) ఇటీవల ముంబై రీజియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్థన్ చందూర్కర్ చేసిన వ్యాఖ్యలపై మాలిక్ స్పందించారు. అయన వైఖరి తమకి ఆమోదయోగ్యం కాదన్నారు. మిత్రపక్షమైనా ఇలా ఒకరి మనసు బాధపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు.
చవాన్ వల్లే ఎన్సీపీ పుంజుకుంది
Published Fri, Nov 15 2013 1:10 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement